Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదుకు ఇంటెల్: కేటీఆర్ తో నివృతి రాయ్ భేటీ (వీడియో)

భారతదేశంలో కంపెనీ విస్తరణ కార్యకలాపాలకు ఇంటెల్ సంస్థ హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నది. ఈ మేరకు శుక్రవారం ఇంటెల్ ఇండియా అధిపతి నివృతి రాయ్ మంత్రి కేటీ రామారావుతో హైదరాబాదులోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. 

Intel to open its Technology centre in Hyderabad
Author
Hyderabad, First Published Nov 9, 2018, 5:43 PM IST

హైదరాబాద్: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ సంస్థ హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నది. భారతదేశంలో కంపెనీ విస్తరణ కార్యకలాపాలకు ఇంటెల్ సంస్థ హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నది. ఈ మేరకు శుక్రవారం ఇంటెల్ ఇండియా అధిపతి నివృతి రాయ్ మంత్రి కేటీ రామారావుతో హైదరాబాదులోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. 

టెక్నాలజీ సెంటర్ ద్వారా ఇంటెల్ సుమారు 1500 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులను నియమించుకుంటుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య 5వేల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది.  మంత్రితో జరిగిన సమావేశంలో తెలంగాణలో ఉన్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్   గురించి చర్చ జరిగింది. 

త్వరలోనే మంత్రి ఇంటెల్  గ్లోబల్ సీఈఓతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న కంప్యూటర్ సర్వర్ల, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ పరికరాల తయారీకి అవసరమైన  అనుబంధ పరిశ్రమల తయారీ సామర్థ్యం, అందుబాటులో ఉన్న అవకాశాల గురించి ఈ సందర్భంగా కంపెనీ బృందం ప్రభుత్వ అధికారులతో చర్చించింది. 

మేకిన్ ఇండియా లో భాగంగా భారతదేశంలో ఇంటెల్ తయారీ రంగంలో విస్తరనకు అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్ కు తెలియజేసింది. కంపెనీ చేపట్టబోయే తయారీ రంగంలోని అవకాశాలకు హైదరాబాద్ కేంద్రాన్ని ఎంచుకోవాలని అయన కోరారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తాజాగా క్వాల్కమ్ పెద్ద ఎత్తున తన కార్యకలాపాలను విస్తరించేందుకు  తీసుకున్న  నిర్ణయాన్ని మంత్రి ఈ సందర్భంగా ఇంటెల్ ప్రతినిధులకు తెలియజేశారు. 

తాజాగా హైదరాబాద్ నగరానికి ఇంటెల్ రావడం తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమికండక్టర్ పరిశ్రమ అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పడతాయన్నారు. తమ కార్యకలాపాల కోసం హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం పట్ల మంత్రి కెటియార్ ఇంటెల్ సంస్థ కు ధన్యవాదాలు తెలిపారు. 

ఈనెల 15న బెంగుళూరులోని ఇంటెల్ ప్రాంగణంలో జరిగే సంస్థ 20వ వార్షికోత్సవ సంబరాలు హాజరుకావాల్సిందిగా  కేటీ రామారావు ని ఇంటెల్ ఇండియా అధిపతి నివృత్తి రాయ్  కోరారు. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ లో భాగంగా ఇంటింటికి ఇంటర్నెట్ తీర్చే కార్యక్రమం పైన వివరాలు అడిగి తెలుసుకున్న ఇంటెల్ ప్రతినిధులు, ఇంటర్నెట్ కనెక్టివిటీ సొల్యూషన్స్ అంశంలో సంస్థకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలన చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతోపాటు టీ- వర్క్స్, తెలంగాణలో ఉన్న పలు స్టార్ట్ అప్ కంపెనీ లతో కలిసి పనిచేసేందుకు ఇంటెల్ సుముఖంగా ఉందని తెలిపారు.

                         "

Follow Us:
Download App:
  • android
  • ios