తెలంగాణలో ఎన్నికల ప్రచార హోరు మొదలైంది.  అన్ని పార్టీల నేతలు తమను గెలిపించండి అంటూ.. ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. పెద్ద పార్టీ నేతలు.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి,  భవిష్యత్తులో చేయబోయే వాటిని వివరిస్తూ.. ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

మరి ఇండిపెండెంట్ అభ్యర్థుల పరిస్థితి ఏంటి..? వాళ్లకు చెప్పుకోవడానికి నాయకుడు ఉండరు కదా.. అందుకే ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేపడుతున్నాడు. రాజీనామా పత్రాలు, చెప్పులు వెంటపట్టుకొని ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆయనే జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ  నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకుల హన్మాండ్లు.

తనను గెలిపించాలని కోరుతూనే.. గెలిచాక.. హామీలు నెరవేర్చకపోతే ఏం చేయాలో కూడా ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తనను చెప్పుతో కొట్టి మరీ పని చేయించుకోవాలంటూ ఓటర్లకు ఆకుల హన్మాండ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకే ఇంటింటికీ తిరుగుతూ కరపత్రం, రాజీనామా పత్రంతో పాటు చెప్పులు కూడా పంచుతున్నారు. 

తన పనితనం నచ్చకపోతే తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీకి పంపించి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఎవరైనా రద్దు చేయించొచ్చంటూ వివరిస్తున్నారు. 70 ఏళ్లుగా మోసపోయారని, ఇకపై అలా జరగకుండా ఉండాలంటే స్వతంత్ర అభ్యర్థి అయిన తనను గెలిపించాలంటూ ఆకుల హన్మాండ్లు కోరుతున్నారు.

                   "