తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, మాజీ మంత్రులకు ఐటీ శాఖ శనివారం నాడు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్: గులాబీ కూలీపై వచ్చిన ఫిర్యాదులపై టీఆర్ఎస్ నేతలకు ఐటీ శాఖ నుండి నోటీసులు అందాయి. గత టర్మ్‌లో ఉన్న మంత్రులందరికీ ఐటీ శాఖ నుండి నోటీసులు అందాయి.
Also read:కేంద్ర బడ్జెట్ 2020: తెలంగాణకు మొండిచేయి, టీఆర్ఎస్ ఎంపీల నిరసన
పార్టీకి నిధుల సేకరణలో భాగంగా టీఆర్ఎస్ నేతలు కూలీ పనులు చేసి పార్టీకి నిధులను సేకరించారు. 2017లో టీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. టీఆర్ఎస్ అగ్రనేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత మంత్రివర్గంలో ఉన్న వారితో పాటు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నవారికి కూడ ఐటీ శాఖ నుండి నోటీసులు అందినట్టుగా సమాచారం.
టీఆర్ఎస్ అధికారంలో లేని సమయంలో కూడ ఈ రకమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ ఇదే తరహా కార్యక్రమాన్ని చేపట్టింది. పార్టీ కోసం విరాళాలను సేకరించేందుకు వీలుగా పలు రకాల కార్యక్రమాలను చేపట్టింది. 2017లో టీఆర్ఎస్ కూలీ పని ద్వారా పార్టీకి విరాళాలను సేకరించింది.
టీఆర్ఎస్ పార్టీ విరాళాల సేకరణపై అప్పట్లోనే ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఐటీ శాఖాధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ విషయమై ప్రస్తుతం ఐటీ శాఖాధికారులు టీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. గులాబీ కూలీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఆ పార్ట అగ్రనేతలు పాల్గొన్నారు.
గత టర్మ్‌లో ఉన్న మంత్రులందరికీ ఐటీ శాఖ నుండి నోటీసులు పంపారని సమాచారం. మిగిలిన వారికి కూడ ఒకటి రెండు రోజుల్లో నోటీసులు అందించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఐటీ నోటీసుల విషయమై పార్టీ తరపున వాదించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం లాయర్‌ను నియమించే యోచనలో ఉందని సమాచారం.
