బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. దేశం మొత్తం ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్.. ప్రజలకు ఆశలు, ఆకాంక్షలకు భిన్నంగా ఉందని టీఆర్ఎస్ శాసనసభాపక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు.

బడ్జెట్ ప్రసంగం పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకి డబుల్ ఇన్‌కం వచ్చేటట్లు చేస్తామన్న బీజేపీ సర్కార్ అది ఏ విధంగా అన్నది తెలియజేయాలేదని ఆయన నిలదీశారు.

Also Read:ఏపీకి కేంద్రం మొండి చేయి: బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు

రైతుల పెట్టుబడులు, ఎరువులు, రుణాలు తదితర అంశాల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదని నామా మండిపడ్డారు. కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంతో పాటు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ విధానాలపై రెండు సర్వేలు వచ్చాయన్నారు.

రైతు బంధు పథకం దేశానికే మోడల్‌గా నిలిచిందని నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని.. అన్ని రకాల అంశాల్లో అద్భుతమైన వృద్ధిరేటు సాధిస్తున్నా.. తమ రాష్ట్రానికి కేటాయింపులు జరగడం లేదని నామా అసహనం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద రావాల్సిన పనులకు నిధులు మంజూరు చేయడం లేదని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ల ఊసే ఎత్తలేదని ఆయన మండిపడ్డారు.

Also Read:జగన్ వల్లే ఏపీకి సున్నా.. కేంద్ర బడ్జెట్ పై యనమల కామెంట్స్

తెలంగాణలో ట్రైబల్ మ్యూజియం కావాలని అడిగినప్పటికీ కేంద్రం మొండిచేయి చూపించిందని నామా నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం వైఖరిపై పార్లమెంట్‌లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.