కరోనా దెబ్బకు ప్రపంచం వణికిపోతుంది. అన్ని దేశాలు కూడా కరోనా బారిన పడకుండా ఉండేందుకు, ఉన్న కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలపై ఆంక్షలు విధిస్తున్నారు. బయట దేశాల నుంచి వచ్చే ప్రజల వల్లే కరోనా అత్యధికంగా ఇతర దేశాల్లోకి ప్రవేశిస్తుండడంతో... ఆ దిశగా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. 

ఇప్పటికే... భారత ప్రభుత్వం యూరప్ నుంచి, టర్కీ నుంచి ప్రయాణీకులను భారత్ లోకి రానీయకుండా నిషేధించింది. కొన్ని ఎయిర్ లైన్స్ ఇప్పటికే భారత్ కు పూర్తిగా విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఇతిహాద్ ఎయిర్ వేస్ ఇప్పటికే చాలా సర్వీసులను తగ్గించేసింది. 

Also read: బ్రేకింగ్: భారత్‌లో నాలుగో కరోనా మరణం

స్పైస్  జెట్, ఇండిగో కూడా ఈ నెల 31 వరకు అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తున్నాయి. విమానాల్లో ప్రయాణీకుల సంఖ్యా కూడా భారీ స్థాయిలో తగ్గింది. విమానంలో సగం సీట్లు కూడా నిండట్లేదని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే సర్వీసులను చాలా వరకు తగ్గించేస్తున్నాయి. 

ఈ అన్ని పరిణామాల నేపథ్యంలోనే శంషాబాద్ విమానాశ్రయం వద్ద పోలీసుల బందోబస్తును పెంచారు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే మార్గాలను కుదించారు. క్యాబ్ డ్రైవర్లు ఎయిర్ పోర్టు వద్ద కనబడడమే లేదు. 

శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్ నడుస్తోంది. పోలీసుల దిగ్బంధంలో ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నది. ఎయిర్ పోర్టు మార్గాలను ఒక్కోటి  మూసివేస్తున్నారు. 

Also read: ఎండలో 15 నిమిషాలు కూర్చొంటే చాలు: కరోనాపై కేంద్ర మంత్రి

విదేశాల నుండి వచ్చే ప్రతి ప్రయాణీకుడిని నేరుగా క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తున్నారు పోలీసులు. క్వారంటైన్ సెంటర్లకు తరలించేందుకు అంబులెన్సులను, అవి అందుబాటులో లేకపోతే ఆర్టీసీ బస్సులను సిద్ధంగా ఉంచారు. 

విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ప్రయాణీకుడిని ముందుగా క్వారంటైన్ సెంటర్‌కు పంపిస్తున్నారు. అక్కడ ఒకటికి రెండు సార్లు టెస్టు చేసి, కరోనా నెగెటివ్  అని తేలితేనే ఇంటికి పంపిస్తున్నారు. 

ఇంటికి పంపగానే కూడా ఆ వ్యక్తి బయట నేరుగా తిరగడానికి వీల్లేదు. 14 రోజుల క్వారంటైన్ పూర్తయిన తరువాతే... అతడు బయట తిరగవలిసి ఉంటుంది. అప్పటి వరకు ఇంట్లోనే ఉండాలి. 

ఇలా పోలీసులు అక్కడ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టును మూసేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.