ఎంసెట్-2 స్కామ్: శ్రీ చైతన్య బాగోతమిది

In overall 90 accused, CID arrests two more in Eamcet scam
Highlights

తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహరంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా శ్రీచైతన్య కాలేజీ డీన్ వోలేజీ వాసుబాబుతో పాటు శ్రీచైతన్య,నారాయణ కాలేజీ ఆడ్మిషన్ల ఏజంట్ శివనారాయణను అరెస్ట్ చేశారు. పలు ప్రవేశ పరీక్ష పేపర్లు లీకైన  ప్రింటింగ్ ప్రెస్‌లోనే పేపర్ల ముద్రణకు ఎందుకు ఇచ్చారనే కోణంలో కూడ అధికారులు దర్యాప్తు  చేస్తున్నారు.


హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీ కేసులో మరికొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా శ్రీచైతన్య కాలేజీ డీన్  వోలేటీ వాసుబాబు, నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో ఆడ్మిషన్ల ఏజంట్  శివనారాయణ అరెస్ట్ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. వరుస లీకేజీలు జరుగుతున్న ప్రింటింగ్ ప్రెస్‌లో ఈ పరీక్ష పేపర్ల ముద్రణను ఎందుకు ఇచ్చారనే కోణంలో కూడ సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ ఎంసెట్ -2 పేపర్ ప్రశ్నపత్రం లీకేజీ కేసును సీఐడీ అధికారులు రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివబహదూర్‌ సింగ్‌ అలియాస్‌ ఎస్బీ సింగ్‌ సహా 60 మందికిపైగా నిందితుల్ని అరెస్టు చేసింది. కేసు దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు శ్రీచైతన్య కళాశాల డీన్‌తోపాటు ఏజెంట్‌ని సీఐడీ అధికారులు గురువారం అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి శ్రీచైతన్య కళాశాలలకు ఓలేటి వాసుబాబు(ఏ-89) డీన్‌గా బాధ్యతలు నిర్వహించడంతోపాటు మరో ఆరు శాఖలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.

గుంటూరుకు చెందిన కమ్మ వెంకట శివనారాయణరావు అలియాస్‌ నారాయణ రావు శ్రీచైతన్య , నారాయణ కాలేజీల్లో ఆడ్మిషన్ల  ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఎంసెట్‌-2  పేపర్ లీకేజీ సమయంలో సంబంధిత ముఠాతో నిందితులిద్దరూ టచ్‌లో ఉన్నట్లు కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. 

ఎంసెట్‌-2 పేపర్  ముద్రణకు సంబంధించి సీఐడీ అధికారులు కేంద్రీకరించారు.పలు రాష్ట్రాలకు చెందిన ప్రశ్నాపత్రాలు లీకేజీ అయిన ప్రెస్‌లోనే  తెలంగాణ అధికారులు కూడ ఎంసెట్ 2 ప్రశ్నపత్రం ముద్రణకు ఆర్డర్ ఇచ్చారు. దీీని వెనుక ఏమైనా మతలబు ఉందా అనే కోణంలో కూడ  దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, తెలంగాణతో పాటు మరో 11 రాష్ట్రాలకు చెందిన పలు రకాల ప్రశ్నపత్రాలను  ఎస్బీసింగ్ ముఠా లీక్ చేసింది. ఇలాంటి కేసులు సుమారు ఎస్బీ సింగ్ ముఠాపై  ఇప్పటికే 10 నమోదయ్యాయి.

ఈ ప్రింటింగ్‌ ప్రెస్ లో ప్రశ్నపత్రాలు ముద్రిస్తే రక్షణ ఉండదనే అభిప్రాయాలు ఉన్నప్పటికీ అదే  ప్రింటింగ్ ప్రెస్ లో ఎందుకు ఈ ప్రశ్నపత్రాలను ముద్రించాల్సి వచ్చిందనే కోణంలో కూడ  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

పదేళ్లుగా ప్రశ్నపత్రాలు లీకవుతున్న ప్రెస్‌లో తెలంగాణ ఎంసెట్‌ నిర్వాహకులు ప్రింటింగ్‌ ఆర్డర్‌ ఎలా ఇచ్చారు? ఎందుకిచ్చారు? అనే విషయంపై ఆరా తీస్తోంది. ఎంసెట్‌-2 లీకేజీ కేసులో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు సీఐడీ కసరత్తు చేస్తోంది. 

ఇప్పటికే నిందితుల అరెస్ట్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు, మధ్యవర్తుల వాంగ్మూలాలను అధికారులు రికార్డు చేశారు. ముసాయిదా చార్జిషీట్‌ రూపొందించిన అధికారులు న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్నారు. ఇతర విద్యాసంస్థలకు చెందిన  వారి ప్రమేయం కూడ ఉందని సీఐడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా కూడ దర్యాప్తు చేస్తున్నారు. 

శ్రీచైతన్య కాలేజీకి డీన్ వోలేటీ వాసుబాబు  ఎంసెట్ లీకేజీ ప్రధాన నిందితుడు ఎస్బీ సింగ్‌తో టచ్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. భువనేశ్వర్‌లో క్యాంపు నిర్వహించిన ధనుంజయ్‌, తాఖీర్‌, సందీప్‌ కుమార్‌తో శ్రీచైతన్య కాలేజీ డీన్‌, ఏజెంట్‌ ఎప్పటికప్పుడు ఫోన్‌లో సంప్రదింపులు జరిపినట్లు సీఐడీ ఆధారాలు సేకరించింది. లీకేజీకి ముందు క్యాంపు నిర్వాహకులతో ఇద్దరు నిందితులు హైదరాబాద్‌లో పలుమార్లు భేటీ అయి డీల్‌ గురించి మాట్లాడుకున్నారని సీఐడీ అధికారులు ప్రకటించారు.

పథకం ప్రకారం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన డీన్‌ వాసుబాబు ఆరుగురు విద్యార్థుల్ని భువనేశ్వర్‌ క్యాంపునకు తరలించాడు. 2016 జూలై 9న నిర్వహించిన ఎంసెట్‌-2 పరీక్షలో క్యాంపుకెళ్లిన ఆరుగురిలో ముగ్గురికి మెరుగైన ర్యాంకులు వచ్చాయి. 

ఒక్కో విద్యార్థి తల్లిదండ్రుల నుంచి రూ.35 లక్షలు వసూలు చేసిన వాసుబాబు ఆ మొత్తాన్ని ఫలితాలు విడుదలైన రోజున క్యాంపు నిర్వాహకులకు ముట్టజెప్పారని అధికారులు గుర్తించారు.

తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్ష పేపర్‌ ముందుగానే పొంది మెరుగైన ర్యాంకులు పొందిన వారిని కూడ సీఐడీ అధికారులు విచారించారు. అయితే వారి వివరాలను మాత్రం వెల్లడించడం లేదు.  విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యానే  అధికారులు ఈ నిర్ణయం తీసుకొన్నారని సమాచారం.

loader