Red Alert: రెడ్ అలర్ట్..మరో 24 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..
Red Alert:రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Red Alert: గత నాలుగైదు రోజుల నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇలా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్థంగా మారింది. అసలు ఈ భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇప్పటికే పలు జిల్లాలోని ప్రాంతాలు.. నీట మునిగాయి. పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో మగ్గుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇలా ఎప్పుడు ఏం జరుగుతోందో అనే భయం గుప్పింట్లో గడుపుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తాజాగా మరో అలర్ట్ జారీ చేసింది.
బుధవారం నాటికీ తీవ్ర అల్పపీడనంగా ఉన్న వాతావరణం ఇవాళ అల్పపీడనంగా బలహీనపడినట్లు వెల్లడించింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశాతో పాటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ మీద అల్పపీడనం నెలకొన్నట్టు భారత వాతావరణ శాఖ రాష్ట్రానికి వరద హెచ్చరిక జారీ చేసింది. అదనంగా.. సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తులో మరొక ఆవర్తనం కొనసాగుతూ ఉందని పేర్కొంది. దీంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ అధికారులు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 8 జిల్లాల్లో ఆరెంజ్ , 14 జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.