తెలంగాణ కాంగ్రెస్ ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న దళిత గిరిజన దండోరా బహిరంగ సభకు తాను హాజరుకావడం లేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఇవాళ(సోమవారం) జరగనున్న దళిత, గిరిజన దండోరా సభకు ఏర్పాటన్ని పూర్తిచేసింది. రేవంత్ రేడ్డి పిసిసి చీఫ్ గా నియమితులైన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ ఇది. అందువల్లే ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి కొన్నిరోజులుగా కాంగ్రెస్ నాయకులంతా జనసమీకరణ, ఏర్పాట్లలో మునిగిపోయారు. ఇలా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఈ సభను విజయవంతానికి తనవంతుగా చేయాల్సిందంతా చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ సభకు తాను హాజరుకావడం లేదంటూ జగ్గారెడ్డి ప్రకటించారు.
తీవ్ర జ్వరంతో బాధపడుతున్నందునే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగే దళిత, గిరిజన దండోరా సభకు హాజరుకావడం లేదని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. పార్టీ నాయకులను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించిన తానే సభకు హాజరుకాకపోతే ఎవరికి నచ్చినట్లు వారు ప్రచారం చేసుకుంటారు... కాబట్టి తాను ఎందుకు సభకు వెళ్లలేకపోతున్నానో ముందుగానే ప్రకటిస్తున్నానని జగ్గారెడ్డి తెలిపారు.
తన నియోజకవర్గం నుండి ఈ సభకు భారీగా దళిత, గిరిజన బిడ్డలను తరలివెళ్లనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. జ్వరం కారణంగా తాను వెళ్లలేకపోతున్నానని... తాను సభలో లేకపోయినా కాంగ్రెస్ కేడర్ గందరగోళానికి గురికావద్దని సూచించారు. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు కృషి చేయాలని జగ్గారెడ్డి కోరారు.
read more అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని రాజీనామా చేయమంటున్నా: రేవంత్ రెడ్డి
జ్వరంతో బాధపడుతుండటం వల్లే ఇటీవల కోర్టుకు కూడా హాజరుకాలేకపోయానని... అందుకే వారెంట్ కూడా జారీ అయ్యిందన్నారు. గత వారం రోజులగా జ్వరం వేధిస్తోందని... అందువల్లే ఇంట్లోంచి బయటకు రాలేక పోతున్నానని తెలిపారు. జ్వరం తగ్గగానే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి దిగుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
ఇదిలావుంటే సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే దళిత గిరిజన దండోరా బహిరంగ సభకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్రస్థాయి ముఖ్య నేతలంతా హాజరయ్యే అవకాశం ఉంది. భారీ జనసమీకరణతో సుమారు 18 ఎకరాల స్థలంలో లక్ష మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ బహిరంగ సభను నిర్వహిస్తోంది.
