వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి దారుణంగా కడతేర్చింది. భార్య వేరే వ్యక్తితో సన్నిహిత సంబంధాన్ని కలిగివుండటాన్ని గుర్తించిన భర్త ఆమెను హెచ్చరించడమే పాపమయ్యింది. కట్టుకున్నవాడన్న కనికరం కూడా చూపకుండా సదరు వివాహిత ప్రియుడితో కలిసి భర్తను గొంతునులిమి హత్య చేసింది. అంతేకాకుండా ఈ హత్యను సాధారణ మృతిగా సృష్టించే ప్రయత్నం చేసి చివరకు కటకటాలపాయ్యింది. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది. 

హైదరాబాద్ గచ్చిబౌలి సమీపంలోని గోపన్ పల్లి తండాలో నివాసముండే అంజనేయులు-సుహాసిని భార్యాభర్తలు. తొమ్మిదేళ్లక్రితం వీరికి వివాహమవగా ముగ్గురు పిల్లలను కలిగివున్నారు. అంజనేయులు నగరంలో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. 

అయితే విధుల్లో భాగంగా ఎక్కువగా భర్త బయటే వుంటుండతంతో సుహాసిని తప్పుడు పనులకు  దిగింది. అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో సాన్నిహిత్యం పెంచుకుంది. అయితే భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన అంజనేయులు ఆమె అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నాడు. దీంతో భార్యతో పాటు ఆమె ప్రియున్ని గట్టిగా  హెచ్చరించాడు. 

 ఇలా తమ విషయం బయటపడటంతో ఇకపై ప్రియుడితో కలుసుకోవడానికి భర్త అడ్డుపడతాడని భావించిన భార్య అతడి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. ఈ క్రమంలోనే రాత్రి భర్త ఇంట్లో పడుకున్న సమయంలో ప్రియుడికి సమాచారం అందించి అతడి సాయంతో భర్త‌ను హత్య చేసింది. అతడి మెడ చుట్టు ఓ టవల్ బిగించి ఊపిరాడకుండా చేసి దారుణంగా హతమార్చారు. 

అనంతరం తెల్లవారుజామున తన భర్త సాధారణంగా మృతిచెందాడని అతడి కుటుంబ సభ్యులను, ఇరుగుపొరుగు వారిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అతడి మెడపై గాయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమె మాటలను నమ్మకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సుహాసినిని విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టింది.  దీంతో ఆమెతో పాటు ప్రియుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలవెనక్కి పంపించారు.