ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. కానీ హైదరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఓ కేసులో ఇంటిదొంగను పట్టుకున్నారు. భర్తను మోసం చేసి ఏకంగా రూ.41లక్షలు కాజేయాలని చూసిన ఓ భార్యను పోలీసులు పట్టుకున్నారు. 

ఈ భారీ చోరీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారి నారాయణ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలున్నారు. పెద్ద భార్య సుధ తన కొడుకుతో కలిసి దిల్ సుఖ్ నగర్ మైత్రి నగర్ గార్డెన్ రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది. అయితే భర్త తన సంపాదనంతా చిన్న భార్యకే అందిస్తూ తనకు అన్యాయం చేస్తున్నాడని సుధ భర్తను అనుమానించేది. దీంతో ఆమె తన భర్త ఇంట్లో దాచిన డబ్బులు కాజేయాలని పథకం వేసింది. 

అయితే అదునుకోసం సుధ ఎదురుచూసింది. భర్త వ్యాపార పనులపై వేరే ప్రాంతానికి వెళ్లడంతో ఇదే సరైన సమయంగా భావించి తన పథకాన్ని అమలు చేసింది. భర్త ఇంట్లో దాచిన 41 లక్షల నగదును ఇంట్లోనే మరోచోట దాచిపెట్టి, ఎవరో దొంగలు వచ్చి కాజేశారని కట్టుకథ అల్లింది. భార్యమాటలు నిజమేనని భావించిన సదరు భర్త జరిగిన దొంగతనంపై సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ చోరీపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్టుమెంట్ లోని సిసి పుటేజిని పరిశీలించారు. ఇందులో సుధ దొంగతనం జరిగినట్లు చెప్పిన సమయంలో కొత్తవారెవరూ అపార్టుమెంట్ లోకి వచ్చినట్లు లేదు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు సుధపై అనుమానంతో విచారించగా భయపడి అసలు విశయాన్ని బైటపెట్టింది. దీంతో ఆమె దాచిన రూ.41 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.