అభివృద్ది కావాలంటే కేసీఆర్ మద్దతు తెలపండి.. : ప్రజలకు బీఆర్ఎస్ పిలుపు
Marri Rajashekhar Reddy: నవంబర్ 13 నుంచి 28వ తేదీ వరకు 11 రోజుల పాటు రోజుకు నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కే చంద్రశేఖర్ రావు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక తమ నియోజకవర్గాల్లో స్థానిక నాయకులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు.
Telangana Assembly Elections 2023: మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కే.చంద్రశేఖర్ రావును మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు. శనివారం మల్కాజిగిరి డివిజన్ లోని దుర్గానగర్, పటేల్ నగర్ లో మాజీ కార్పొరేటర్ జగదీశ్ గౌడ్ తో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. మల్కాజిగిరిని నియోజకవర్గానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటాననీ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంజుల, నీలం సతీష్, శ్రీనివాస్ గౌడ్, సాయినాథ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా, ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రచారం గేర్ మార్చారు. నవంబర్ 13 నుంచి 28వ తేదీ వరకు 11 రోజుల పాటు రోజుకు నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త షెడ్యూలుతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కోసం 96 సభల్లో ప్రసంగిస్తారని ఆయన కార్యాలయం నుంచి వచ్చిన ఒక ప్రకటనలో పేర్కొంది. అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభతో ప్రచారం ప్రారంభించిన ఆయన శనివారం వరకు 30 నియోజకవర్గాల్లో సభల్లో ప్రసంగించారు. తాను పోటీ చేస్తున్న గజ్వేల్ లో తన చివరి బహిరంగ సభతో ఆయన ప్రచారాన్ని ముగించనున్నారు. ఈ నెల 9న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
కాగా, వరంగల్ జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు అనుగుల రాకేష్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ నాయకుడు మాదాసు వెంకటేష్ తో కలిసి శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరామారావు, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఇతర ఎమ్మెల్యేల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరానని తెలిపారు.