హైదరాబాద్: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరిగితే కఠిన చర్యలు తీసుకొంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. 

సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి  మీడియాతో మాట్లాడారు.ప్రతి రోజూ సాయంత్రం ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు కూడ ప్రజలు ఎవరూ కూడ బయట తిరగకూడదన్నారు.ఒకవేళ తిరిగితే కఠిన చర్యలు తీసుకొంటామని సీఎస్ హెచ్చరించారు. 

వ్యవసాయ పనులు, ఈజీఎస్ పనులు యధావిధిగా కొనసాగుతాయని సీఎస్ చెప్పారు. అయితే శానిటైజేషన్ పక్కాగా ఏర్పాట్లు చేసుకొన్న తర్వాతే ఈ కార్యక్రమాలను కొనసాగించాలని సీఎస్ సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ పనులను మాత్రం అనుమతి ఇచ్చినట్టుగా ఆయన స్పష్టం చేశారు. అత్యవసర దుకాణాలు మినహా ఇతరు దుకాణాలను మూసివేయాలని ఆయన ఆదేశించారు.

ఐదుగురికి మించి గుమికూడదని  సీఎస్ కోరారు. విదేశాల నుండి వచ్చిన వారంతా స్వచ్ఛంధంగా క్వారంటైన్ పాటించాలని కోరారు. ఒకవేళ  ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే  అవసరమైతే పాస్ పోర్టు కూడ సీజ్ చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను మూసివేసినట్టుగా సీఎస్ చెప్పారు.

నిత్యావసర సరుకుల కోసం ప్రజలు తాము నివాసం ఉండే ప్రాంతాల నుండి కిలోమీటరు పరిధిలో మాత్రమే తిరగాలని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.

లాక్ డౌన్ ఉన్నందున ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టుగా డీజీపీ తెలిపారు. రోడ్లపైకి వచ్చే ప్రజలు ఏ కారణం చేత రోడ్లపైకి వచ్చారో కారణం కనుక్కొంటారని ఆయన చెప్పారు.

1897 చట్టం కింద లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకొంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని డీజీపీ హెచ్చరించారు. అవసరమైతే వాహనాలను కూడ సీజ్ చేస్తామన్నారు.

Also read:కరోనా ఎఫెక్ట్: సుప్రీంకోర్టు లాక్ డౌన్, వారానికి ఒక్క రోజే

బైక్ లపై ఒక్కరు, కార్లు లేదా ఇతర వాహనాల్లో డ్రైవర్లు లేదా మరొకరికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై  చట్టప్రకారంగా చర్యలు తీసుకొంటామన్నారు.

నియమ నిబంధనలను ఉల్లంఘించినవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకొంటామని డీజీపీ హెచ్చరించారు. వైద్య సేవల కోసం ప్రైవేట్ వాహనాలను రోడ్లపైకి అనుమతి ఇస్తామని డీజీపీ ప్రకటించారు.