కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రాష్ట్రం మొత్తాన్ని అమ్ముకుంటాడు..: కేటీఆర్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లిన దొంగ రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్లాట్లుగా విభజించి అమ్ముకుంటారని ఆరోపించారు. మంగళవారం రోజును ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేను రూ. 50 లక్షలకు కొంటూ రేవంత్ రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడని విమర్శించారు. నోటుకు ఓటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడని అన్నారు.
‘‘కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ కొనుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ టిక్కెట్ల ధరను రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాతే ఆ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడింది. రేవంత్‌కు అధికారమిస్తే రాష్ట్రంలోని భూములన్నింటినీ ప్లాట్లు వేసి అమ్ముకుంటాడు. రేవంత్, కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు 11 సార్లు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. కాంగ్రెస్ పాలనలో నీరు, విద్యుత్, ఇతర సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే గత 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
రైతులకు మూడు గంటల విద్యుత్ మాత్రమే అవసరమని రేవంత్ రెడ్డి అన్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న రేవంత్ మనస్తత్వం ఏంటో రైతులు తెలుసుకోవాలని కోరారు. రైతు బంధు వృథా ఖర్చు అని పీసీసీ మాజీ చీఫ్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని.. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా వారి రాష్ట్రంలోని రైతులకు కేవలం ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పారని అన్నారు. వారి మాటలు చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు.