కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడం లేదు, సీతక్కతో స్మితా సభర్వాల్ భేటీ:ఏం జరుగుతుంది?
తెలంగాణ సచివాలయానికి ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ ఇవాళ వచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా స్మితా సభర్వాల్ సచివాలయానికి చేరుకున్నారు.
హైదరాబాద్: ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ గురువారంనాడు తెలంగాణ సచివాలయానికి వచ్చారు. సచివాలయంలో తెలంగాణ మంత్రి ధనసరి అనసూయ( సీతక్క)తో స్మితా సభర్వాల్ భేటీ అయ్యారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్మితా సభర్వాల్ సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ సీఎంఓ ప్రత్యేక కార్యదర్శిగా ఉంటూ నీటిపారుదల శాఖ బాధ్యతలు నిర్వహించారు.
తెలంగాణలో ప్రభుత్వం మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో స్మితా సభర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తారనే ప్రచారం కూడ సాగింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్మితా సభర్వాల్ సీఎం అనుముల రేవంత్ రెడ్డిని కలవకపోవడంపై కూడ చర్చ సాగుతుంది.
అయితే తాను కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడం లేదని ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాను తెలంగాణ రాష్ట్రంలోనే తాను తన సేవలను కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసిన తర్వాత స్మితా సభర్వాల్ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయంలో మంత్రి సీతక్కను స్మితా సభర్వాల్ కలిశారు. సచివాలయానికి దూరంగా ఉన్న స్మితా సభర్వాల్ మంత్రి సీతక్కను కలవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.
2001 బ్యాచ్ ఐఎఎస్ అధికారి స్మితా సభర్వాల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలుత ఆదిలాబాద్ జిల్లాలో ఆమె పనిచేశారు. 2003 జూలై 14 నుండి 2004 నవంబర్ 27వ తేదీ వరకు చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా పనిచేశారు. 2004 నవంబర్ 28వ తేదీ నుండి 2004 డిసెంబర్ 31వ తేదీ వరకు గ్రామీణాభివృద్ది శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేశారు.
2005 జనవరి 1వ తేదీ నుండి 2006 మే 15వ తేదీ వరకు కడపలో ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేశారు. 2006 మే 16 నుండి 2007 మే 29వ తేదీ వరకు వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా పనిచేశారు. 2007 మే 29 నుండి 2009 అక్టోబర్ 22 వ తేదీ వరకు విశాఖపట్టణంలో వాణిజ్య పన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు.2009 అక్టోబర్ 22 నుండి 2010 ఏప్రిల్ 9వ తేదీ వరకు కర్నూల్ జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత హైద్రాబాద్ జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. 2010లో కరీంనగర్ కలెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహించారు. మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో స్మితా సభర్వాల్ చేపట్టిన కార్యక్రమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చాయి.
2014లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్మితా సభర్వాల్ ను సీఎంఓలోకి తీసుకున్నారు. దాదాపుగా పదేళ్ల పాటు సీఎంఓలో స్మితా సభర్వాల్ పనిచేశారు.
స్మితా సభర్వాల్ భర్త అకున్ సభర్వాల్ ఐపీఎస్ అధికారి. అకున్ సభర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. గతంలో తెలంగాణలో ఎక్సైజ్ శాఖలో అకున్ సభర్వాల్ పనిచేసిన సమయంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసును విచారించారు. అప్పట్లో పలువురు సినీ రంగానికి చెందిన వారిని అకున్ సభర్వాల్ విచారించిన విషయం తెలిసిందే.