ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఏర్పాట్లపై రవాణా అధికారులకు సోమేశ్ కుమార్ దిశానిర్దేశం చేశారు.

ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆయన సూచించారు. డ్రైవర్‌కు రోజుకు రూ.1500, కండక్టర్‌కు రూ.1000 ప్రకారం చెల్లించాలని సోమేశ్ ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామరెడ్డి స్పందించారు.

కమిటీలపై తమకు నమ్మకం లేదని తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు వెళ్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తమను చర్చలకు పిలిచి అవమానించారని అశ్వద్ధామరెడ్డి మండిపడ్డారు.

బుధవారం ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5 నుంచి సమ్మెలోకి వెళుతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ కమిటీ గురువారం మరోసారి చర్చలకు పిలిచింది.

ఈ సందర్భంగా సమ్మె వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ జేఏసీకి కమిటీ సూచించింది. పండగ రద్దీతో సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరింది. అయితే తమకు స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే నిర్ణయం చెబుతామని.. ప్రధానంగా ఆర్టీసీ విలీనం, పీఆర్‌సీ అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.