ఈ నెల 21న బీజేపీలో చేరడం లేదు: తేల్చేసిన జయసుధ
ఈ నెల 21న తాను బీజేపీలో చేరుతున్నట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని జయసుధ ప్రకటించారు. పార్టీలో చేరాలని జయసుధతో బీజేపీ నేతలు చర్చించారు.
హైదరాబాద్: ఈ నెల 21న తాను BJP లో చేరడం లేదని సినీ నటి, మాజీ ఎమ్మెల్యే Jayasudha స్పష్టం చేశారు.పార్టీలో చేరాలని జయసుధతో BJP నేతలు సంప్రదింపులు జరిపారని సమాచారం. అయితే పార్టీలో చేరిక విషయమై జయసుధ బీజేపీ నాయకుల వద్ద కొన్ని డిమాండ్లు పెట్టినట్టుగా ప్రచారం సాగుతుంది.ఈ డిమాండ్లను అంగీకరిస్తే బీజేపీలో చేరేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా జయసుధ సంకేతాలు పంపారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. తన డిమాండ్ల విషయమై బీజేపీ కేంద్ర నాయకత్వం నుండి హామీ లభిస్తే తాను ఆ పార్టీలో చేరేందుకు సిద్దమేనని జయసుధ సంకేతాలు ఇచ్చారని ఆ కథనం తెలిపింది. ఈ నెల 21న మునుగోడు ఎమ్మెల్యే Komatireddy Rajagopal Reddyతో పాటు తాను బీజేపీలో చేరుతాననే ప్రచారాన్ని జయసుధ తోసిపుచ్చారు.
also read:జయసుధతో బీజేపీ నేతల సంప్రదింపులు: పార్టీలో చేరాలని కోరుతున్న కమలం నేతలు
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె విజయం సాధించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి జయసుధ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి జయసుధ మరోసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. 2016 జనవరి 17న ఆమె కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. :ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో టీడీపీ బలోపేతం కోసం తాను ప్రయత్నిస్తానని ఆమె ప్రకటించారు. 2019లో జయసుధ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీలో చేరినప్పటికీ జయసుధ ఆ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గోనడం లేదు. రాజకీయ కార్యక్రమాలకు ఆమె దూరంగానే ఉంటున్నారు.ఈ తరుణంలోనే బీజేపీ నేతలు జయసుధతో చర్చలు జరిపారు. బీజేపీలో చేరాలని కోరారు. అయితే పార్టీలో చేరేందుకు జయసుధ కొన్ని డిమాండ్లు పెట్టినట్టుగా సమాచారం.
తెలంగాణ రాష్ట్రంలో కీలక నేతలను తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలని కమలదళం నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు దీంతో రాష్ట్రంలో కీలక నేతలతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీతో టచ్ లో ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరిన్ని ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని బండి సంజయ్ చెప్పారు.