జయసుధతో బీజేపీ నేతల సంప్రదింపులు: పార్టీలో చేరాలని కోరుతున్న కమలం నేతలు
మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధను బీజేపీలో చేరాలని కమలం నేతలు కోరుతున్నారు.ఈ విషయమై ఆమెతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు.
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. బీజేపీలో చేరాలని కమలం నేతలు కోరుతున్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జయసుధ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.
2014 జూన్ 2న ఏపీ,,తెలంగాణ రాష్ట్రాల విభజన జరిగింది. అవశేష ఏపీ రాస్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ పరిణామాలతో 2016 జనవరి 17న ఆమె టీడీపీలో చేరారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో జయసుధ టీడీపీని వీడారు. 2019 మార్చిలో జయసుధ, ఆమె తనయుడు వైసీపీలో చేరారు. కొంత కాలంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలతో పాటు వీఐపీలతో కూడ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీలో చేరే విషయమై ఆమె స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు నేతలు బీజేపీలో చేరనున్నారు.ఈ తరుణంలో జయసుధ కూడా బీజేపీలో చేరేలా బీజేపీ నాయకులు ప్లాన్ చేశారు. అయితే బీజేపీలో చేరిక విషయమై జయసుధ మాత్రం స్పష్టత ఇవ్వలేదని సమాచారం.సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారని సమాచారం.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదుపుతుంది.ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలతో బీజేపీ నాయకులు చర్చిస్తున్నారు. బీజేపీలో చేరికల కమిటీ చైర్మెన్ ఈటలరాజేందర్ నేతృత్వంలోని బృందం చర్చలు జరుపుతుంది. మరో వైపు ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం ఇటీవలనే ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేతలతో పార్టీలో చేరికల విషయమై చర్చించారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రోత్సాహంతో జయసుధ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి విజయం సాధించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2014 తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో జయసుధ టీడీపీలో చేరారు.2019 ఎన్నికలకు ముందు జయసుధ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కానీ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.దీంతో జయసుధతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారు. బీజేపీలో చేరే విషయమై జయసుధ నుండి స్పష్టత రాలేదని తెలుస్తోంది.