చివరి అస్త్రం అదే అనుకున్నా, కొన్ని సీక్రెట్: రాష్ట్ర విభజనపై కిరణ్‌కుమార్ రెడ్డి

Iam committed to strengthen Congress says former chief minister Kiran kumar reddy
Highlights

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే  ఉమ్మడి రాష్ట్ర విభజన ఆగిపోతోందని భావించినట్టు ఉమ్మడి ఏపీ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు


హైదరాబాద్:రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ తీర్మానం చేస్తే  ఉమ్మడి రాష్ట్ర విభజన ఆగిపోతోందని భావించినట్టు ఉమ్మడి ఏపీ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే సమయంలో  తాను చేసిన ప్రమాణాన్ని పురస్కరించుకొని కొన్ని విషయాలను తాను ఇంటర్వ్యూల్లో చెప్పలేనన్నారు. 

ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఏపీ రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలు కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం వెనుక ఉన్న కారణాలపై ఆయన  తన అభిప్రాయాలను వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో  కిరణ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్  పార్టీలో చేరిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తొలి సారిగా మీడియా ఛానెల్‌తో మాట్లాడారు. నాలుగేళ్లు మినహ తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినట్టు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.

రాష్ట్ర విభజన విషయమై పార్టీ తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  తాను  పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజిస్తే  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఉండదనే విషయాన్ని తాను పార్టీ నాయకత్వానికి ఆనాడే చెప్పినట్టు ఆయన గుర్తు చేశారు. 

నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండడం సుదీర్ఘకాలమని తనను తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని  పార్టీ నాయకత్వం తనను కోరిందన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరానని ఆయన చెప్పారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  తాను పార్టీకి నష్టం కల్గించే విధంగా ఏనాడూ కూడ ప్రవర్తించలేదన్నారు. పార్టీకి నష్టం చేస్తే ఎందుకు తనను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయన ప్రశ్నించారు. 

రాష్ట్ర విభజన జరిగితే  తెలంగాణ అంధకారంగా మారుతోందని  తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.  ఆనాడు తెలంగాణలో ఉత్పత్తికి, వినియోగానికి మధ్య సుమారు 2 వేల మెగావాట్ల వ్యత్యాసం ఉందన్నారు.

అయితే  హైద్రాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పదేళ్ల పాటు ఏర్పాటు చేస్తున్నందున... తెలంగాణకు అవసరమైన విద్యుత్ ను 5 ఏళ్ల పాటు ఇస్తే ఇబ్బందులు ఉండవని ఆనాడు తాను సోనియాకు చెప్పానని అందుకు ఆమె కూడ అంగీకరించారని చెప్పారు.

ఏపీ విభజన హమీ చట్టాన్ని ఇప్పటికి రెండు సార్లు మార్చారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే చిత్తశుద్ది కేంద్రానికి లేదన్నారు. 14వ, ఆర్థిక సంఘం ఎక్కడ కూడ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని చెప్పలేదన్నారు.  పార్లమెంట్‌లో ఇచ్చిన హమీలు, యూపీఏ ప్రభుత్వం చేసిన తీర్మానం ప్రాతిపదికగా చేసుకొని ప్రత్యేక హోదా ఇవ్వవచ్చన్నారు.

ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించిన తర్వాత ఉత్తర భారతంలో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లకే పరిమితమైందన్నారు. ఇందిరాగాంధీ కూడ ఆ సమయంలో ఓటమిపాలయ్యారని ఆయన గుర్తుచేశారు. తాను చేసిన పనికి ఇందిరాగాంధీ క్షమాపణలు చెప్పడంతో  ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని  ఆయన గుర్తుచేశారు. ఏపీలో  కూడ కాంగ్రెస్ పార్టీ తిరిగి బలోపేతమయ్యే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్టీ ఏ పని అప్పగించినా తాను ఆ పనిచేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.  తాను కాంగ్రెస్ పార్టీలో చేరితే రఘువీరారెడ్డికి ఎలాంటి నష్టం లేదన్నారు. తామిద్దరం ఒకేసమయంలో  ఎమ్మెల్యేలుగా ఎన్నికైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ జిల్లాకు రఘువీరారెడ్డి సుదీర్ఘ కాలం  ఇంచార్జీగా కొనసాగారని ఆయన గుర్తుచేసుకొన్నారు. తమ మధ్య  ఎలాంటి బేదాభిప్రాయాలు లేవన్నారు. 

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే  తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు న్యాయం జరుగుతోందని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. యూపీఏ బలం పుంజుకొందన్నారు . 2019లో యూపీఏ అధికారంలోకి వస్తోందని కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీని బలోపేతం చేయడమే తన ముందు లక్ష్యమని ఆయన చెప్పారు.

loader