హైదరాబాద్: కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అక్క విజయం సాధించాలని తాను మనసారా కోరుకొంటున్నట్టు  సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో భార్య, తల్లితో కలిసి జూనియర్ ఎన్టీఆర్  ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
కూకట్‌పల్లి అసెంబ్లీ  నియోజకవర్గం  నుండి జూనియర్ ఎన్టీఆర్ సోదరి  నందమూరి సుహాసిని టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగింది. సుహాసిని  తరపున బాలకృష్ణ,చంద్రబాబునాయుడు, తారకరత్నలు ప్రచారం నిర్వహించారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు కూడ కూకట్‌పల్లి నుండి పోటీ చేస్తున్న సుహాసిని  తరపున  మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని తొలుత ప్రచారం సాగింది.
అయితే జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్‌లు మాత్రం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. సినిమా బిజీ కారణంగానే   జూనియర్ ఎన్టీఆర్  సుహాసిని తరపున ప్రచారానికి రాలేదని సమాచారం.

నందమూరి సుహాసిని  అభ్యర్థిత్వాన్ని కుటుంబ సభ్యులు ఆమోదించారని  సుహాసిని ప్రకటించారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు రోజు సుహాసిని మీడియాతో మాట్లాడిన సమయంలో  హరికృష్ణ సోదరుడు ఆమెతో ఉన్నారు.

సుహాసిని నామినేషన్ దాఖలు చేసే ముందు  ఎన్టీఆర్ ఘాట్, హరికృష్ణ సమాధుల వద్ద నివాళులర్పించిన సమయంలో బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబసభ్యులు కూడ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

ఓటేయకపోతే నేతలను అడిగే హక్కు లేదు: జూ.ఎన్టీఆర్