త్వరలో నా పాదయాత్ర షెడ్యూల్ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
త్వరలోనే తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటిస్తానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ఆ యాత్ర సాగుతుంది.
హైదరాబాద్:త్వరలోనే తన పాదయాత్ర షెడ్యూల్ ను ప్రకటించనున్నట్టుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం నాడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమానికి సంబంధించి తన పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ను త్వరలోనే ప్రకటించనున్నట్టుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.ప్రగతి భవన్ పై రేవంత్ రెడ్డి ఏం కామెంట్స్ చేశారో చూడలేదన్నారు. కాళేశ్వరమే కాదు అన్ని ప్రాజెక్టులను సందర్శిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురించి వాస్తవాలనే కేసీఆర్ మాట్లాడారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు ఆయన అవివేకానికి నిదర్శనంగా పేర్కొన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో తాము పాల్గొంటామని భట్టి విక్రమార్క చెప్పారు.
అసెంబ్లీ సమావేశాల తర్వాత హత్ సే హత్ జోడో అభియాన్ కార్యక్రమం కింద కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా పాదయాత్రలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.
అసెంబ్లీ ముగిసినందున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాదయాత్రలు నిర్వహించనున్నారు.ఈ నెల 13 నుండి యాత్రకు సిద్దమౌతున్నట్టుగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే . నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో యాత్ర చేయనున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.
also read:జగిత్యాలలో జలపతి రెడ్డి ఆత్మహత్య: బాధ్యులపై చర్యలకై డీజీపీని కలిసిన భట్టి
మరో వైపు తన నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించనున్నట్టుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. తనను ఎవరైనా పాదయాత్రకు రావాలని ఆహ్వానిస్తే వెళ్తానని జగ్గారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది.