నల్గొండ: నల్గొండ జిల్లాలోని రెండు అసెంబ్లీ సీట్ల నుండి కోమటిరెడ్డి సోదరులు పోటీ చేయనున్నారు..ఈ మేరకు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. టిక్కెట్ల కేటాయింపు విషయమై  పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతున్న తరుణంలో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. 

మునుగోడు నుండి తన సోదరుడు  కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని   మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.  అయితే మునుగోడు నుండి  మాజీ మంత్రి పాల్వాయి గోవర్థన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి కూడ  కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టును ఆశిస్తోంది.

అయితే చాలా కాలంగా మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ప్లాన్ చేసుకొంటున్నారు. అయితే  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్లు కేటాయిస్తోందా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం  కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక  స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థిగా తేరా చిన్పపరెడ్డిపై  ఆయన పోటీ చేసి విజయం సాధించారు.

2009 ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడ ఆయన అదే స్థానంలో పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో ఆయన స్థానికసంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించాడు.

ఇదిలా ఉంటే ఈ దఫా తెలంగాణలో అధికారం కోసం కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తోంది. టీడీపీతో పాటు ఇతర పార్టీలతో కూడ పొత్తులు పెట్టుకోవాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని సీపీఐ కూడ భావిస్తోంది.

సీపీఐతో పొత్తు ఉంటే మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని సీపీఐ కోరే అవకాశం ఉంది. సుదీర్ఘ కాలం పాటు ఈ స్థానంలో సీపీఐ అభ్యర్థులు ప్రాతినిథ్యం వహించారు.  ప్రస్తుతం  మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీపీఐతో పొత్తు ఉంటే మాత్రం ఈ స్థానాన్ని సీపీఐ వదిలిపెట్టకపోవచ్చు. 

ఒకవేళ  ఈ స్థానానికి బదులుగా వేరే స్థానం ఇచ్చినా సీపీఐ తీసుకొనే అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే పొత్తులపై ఇంకా స్పష్టత రానందున  కోమటిరెడ్డి సోదరులకు ఇబ్బందులు లేకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

శుక్రవారం నాడు గాంధీభవన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ  కార్యవర్గ సమావేశంలో కూడ  పొత్తుల విషయమై హాట్ హాట్ గా చర్చ సాగింది. పొత్తులు ఉంటే  ముందే తమకు చెప్పాలని కూడ  పార్టీ నేతలు తేల్చి చెప్పారు.

అంతేకాదు ఆయా నియోజకవర్గ ఇంచార్జీలను ఒప్పించిన తర్వాతే  పొత్తులు, సీట్ల కేటాయింపుపై నిర్ణయాన్ని ప్రకటించాలని  కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్‌ కుమార్ రెడ్డికి సూచించారు.

ఇదిలా ఉంటే  కాంగ్రెస్ పార్టీలో  అభ్యర్థులను  ఇంకా ప్రకటించలేదు. అభ్యర్థుల జాబితా తయారీ కసరత్తు కొనసాగుతోంది. ఈ తరుణంలో  నల్గొండ నుండి తాను, మునుగోడు నుండి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడం కూడ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై కొందరు సీనియర్లు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.