హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని సీఎం ఆదేశిస్తే తాను చర్చలకు సిద్దంగా ఉన్నట్టుగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు స్పష్టం చేశారు, సమ్మె విరమించి ప్రభుత్వంలో చర్చించాలని కేశవరావు సోమవారం నాడు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

కేశవరావు ప్రకటనపై ఆర్టీసీ జేఎసీ నేతలు కూడ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వంతో చర్చలకు  కేశవరావు మధ్యవర్తిత్వం వహించాలని కోరారు.

సోమవారం నాడు ఉదయం ప్రకటన విడుదల చేసిన కేశవరావు ఢిల్లీకి వెళ్లారు. ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వథామ రెడ్డి కూడ తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని ప్రకటించడంతో చర్చలు పున:ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాతావరణం కన్పించింది.


సోమవారం నాడు ఉదయం ఢిల్లీకి వెళ్లిన కేశవరావు సోమవారం రాత్రి ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు చేసేందుకే కేశవరావు డిల్లీకి వచ్చినట్టుగా భావించారు.

ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు వచ్చిన కేశవరావు  సోమవారం రాత్రి  మీడియాతో మాట్లాడారు. సీఎం ఆదేశిస్తే ఆర్టీసీ కార్మికులతో తాను చర్చలకు సిద్దమేనని ఆయన ప్రకటించారు.సమ్మె విరమించాలని తాను కార్మికులకు విన్నవించినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ఆర్టీసీ కార్మికులు  తనను మధ్యవర్తిత్వం వహించాలని కోరినట్టుగా తనకు తెలియదన్నారు. కార్మికుల సమ్మెపై తాను సీఎం కేసీఆర్ తో చర్చిస్తానని ఆయన చెప్పారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్న కార్మికులు సెల్ప్ డిస్మిస్ అయినట్టుగా సీఎం ప్రకటించారు. ఈ ప్రకటనతో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మికులు ఈ నెల 19వ  తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు.

ఈ బంద్ కు టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి. విద్యార్ధి సంఘాలు కూడ ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ తన మద్దతును ఉపసంహారించుకొంది.