Asianet News TeluguAsianet News Telugu

31 ఏళ్ల రాజకీయం, ఎకరం భూమిలేదు : కడియం ఉద్వేగం

కలెక్టర్ల సన్మాన సభలో కీలక విషయాలు చెప్పిన కడియం

I am not having single acre of land: kadiam

31 ఏళ్ల రాజకీయం, ఎకరం భూమిలేదు : కడియం ఉద్వేగం

తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి భావోద్వేగ ప్రసంగం చేశారు. అది కూడా ఎక్కడో తెలుసా? కలెక్టర్ల అవార్డుల కార్యక్రమంలో 31 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ ఎకరం భూమి కొనుక్కోలేదని కడియం వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు చదవండి.

 ‘‘ మీరు ఐఎఎస్ అధికారులు, నిర్ణయాధికారం మీ చేతిలో ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నప్పుడు పక్షపాతంతో ఉండడం గానీ, ముందే ఒక అభిప్రాయం కలిగి ఉండడం కానీ మంచిది కాదు. మీ దగ్గకుకు వచ్చిన ఫైళ్లను నెలల తరబడి పెండింగ్ లో పెట్టొద్దు. మీరు ఏది రాయాలనుకుంటే అది రాసి పంపాలి. చివరకు మంత్రి, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. కానీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఉండొద్దు.. చేసే పనిలో నిమగ్నమై చేయాలి,  ఆ పనులు చిరకాలం ప్రజలు గుర్తుంచుకునేలా ఉండాలి ’’ అని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు సూచించారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటిఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జోషి, సీనియర్ ఐఎఎస్ అధికారులు పాల్గొన్నారు.

రాజ్యాంగంలో అత్యంత కీలకమైన లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యూడిషియరీ వ్యవస్థలపై ప్రజలకు ఉండాల్సినంత విశ్వాసం ఉండడం లేదని, రోజురోజుకు సన్నగిల్లుతోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అయితే ఈ వైఫల్యాలను సరిచేసుకోకుండా ఒకరినొకరు నిందించుకునే పని జరుగుతోందన్నారు. ప్రజలు ఈ ముగ్గురిలో ఏ ఒక్కరి గురించి చెడుగా మాట్లాడినా ఈ ముగ్గురు బాధ్యులే అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవల రైతులకు బ్రహ్మండమైనా పథకం ప్రవేశపెట్టారని, అయితే ఈ పథకం కింద పాస్ బుక్ తీసుకునే భాగ్యం తనకు దక్కలేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తను రాజకీయాల్లోకి వచ్చి 31 సంవత్సరాలు అయిందని, ఈ 31 సంవత్సరాల్లో ఒక్క ఎకరా భూమి కూడా సంపాదించుకోలేకపోయానన్నారు. తనది వ్యవసాయ కుటుంబం కాదని, వ్యవసాయ కూలీ కుటుంబమని, అప్పుడెలా తనకు భూమి లేదో, ఇప్పటికీ అలాగే భూమి లేదని చెప్పారు. చాలామంది చాలా చెబుతుంటారని, అయితే చెప్పేవారు వాటిని ఆచరించడం అంత సులువు కాదన్నారు.

ఐఎఎస్ అధికారులు నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉంటారని, నిర్ణయాలు తీసుకునేవారు ఏదైనా అంశం గురించిగానీ, సమస్యగురించిగానీ ముందే ఒక అభిప్రాయంతో ఉండొద్దని, పక్షపాత వైఖరి కలిగి ఉండొద్దని, సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఇక ఫైళ్లను కొంతమంది అధికారులు నెలల తరబడి తమ దగ్గరే ఉంచుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తన దగ్గర ఏ ఫైల్ గానీ 24 గంటలకు మించి ఉండదని, విద్యాశాఖలో చాలా ఫైల్స్ వస్తుంటాయని, అయినా వాటిని పెండింగ్ లో పెట్టనని చెప్పారు. అధికారులు కూడా ఏదైనా ఫైల్ వారి వద్దకు వచ్చినప్పుడు దానిని పెండింగ్ లో పెట్టకుండా తమకు తోచింది ఫైల్ పై రాసి పంపాలన్నారు. చివరకు నిర్ణయం సంబంధిత మంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ తీసుకుంటారని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే ధృక్పథంతో వ్యవహరించాలని, ఖర్చు పెట్టే డబ్బులన్నీ ప్రజలవేనని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. ప్రజల డబ్బును ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేసే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రజల్లో చిరస్థాయిగా ఉండేపోయే పనులు చేయాలన్నారు.

తాను 1999లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్యదర్శిగా ఐ.వి సుబ్బారావు, కమిషనర్ గా నాగార్జున ఉండేవారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. అప్పట్లో వేసవి సెలవులు వచ్చాయంటే బదిలీలకోసం తమపై తీవ్ర ఒత్తిడి ఉండేది, దీనికి పరిష్కారం లేదా? అని ఒకసారి ఐవి సుబ్బారావు, నాగార్జున కూర్చోని చర్చించినప్పుడు కౌన్సిలింగ్ చేయాలని, దీనికి రిస్క్ చేయాల్సి ఉంటుందని చెప్పారని గుర్తు చేశారు. వెంటనే దీనిని నాటి సిఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్తే కౌన్సిలింగ్ చేయగలిగితే...దానిని సపోర్ట్ చేసే మొదటి వ్యక్తిని నేనే అని ఆయన ప్రోత్సహించడంతో ఉపాధ్యాయుల బదిలీలలకు కౌన్సిలింగ్ విధానం తీసుకురాగలిగామని చెప్పారు. ఇప్పటికీ ఈ విధానం కొనసాగుతుందని తెలిపారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఎక్కువగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను సందర్శిస్తానని, అక్కడి విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుంటుంటానని చెప్పారు. ఇందులో భాగంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఉండే బాలికలు తీవ్ర రక్తహీనతతో ఉన్నారని, రుతు సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించామన్నారు. దీనికోసం డాక్టర్లు, అధికారులతో కలిసి చర్చించినప్పుడు ఆ బాలికలకు మంచి పౌష్టికాహారం అందిస్తే రక్తహీనతను అధిగమించవచ్చని, న్యాప్కిన్స్ అందిస్తే రుతు సమస్యలను దూరం చేయవచ్చని సలహా ఇచ్చారన్నారు. ఈసలహా మేరకు నేడు మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, గురుకులాలలో దేశంలో ఎక్కడా లేని విధంగా నెలకు ఆరుసార్లు నాన్ వెజ్, వారానికి ఐదుసార్లు గుడ్లు, రోజు నెయ్యి, టిఫిన్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. దీనివల్ల ఏడాదిలోనే ఈ బాలికల్లో రక్తంలో హిమోగ్లోబిన్ పెరిగి, రక్తహీనత తగ్గిందన్నారు. అదేవిధంగా నేడు తెలంగాణలో 80 లక్షల మందికి న్యాప్కిన్లు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా తెలంగాణే అని, ఇవి చేయడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు.

సమగ్ర కుటుంబ సర్వే, భూరికార్డుల ప్రక్షాళన వంటి గొప్ప కార్యక్రమాలను సిఎం కేసిఆర్ నేతృత్వంలో మీరే గొప్పగా చేశారని, ఏ పనిలో అయినా నిమగ్నం అయితే అక్కడ తృప్తి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు సూచించారు. జీవితంలో ఏదీ పూలబాట కాదని, ప్రతిచోట్ల ముల్లు ఉంటాయని, అయితే వాటిని పూలబాటగా మార్చుకోవాల్సింది మనమేనని చెప్పారు. కొత్తగా సర్వీసులో చేరనున్న 61 మంది అభ్యర్థులు మీ బాటను పూలబాటగా మార్చుకోవాలని, అది ప్రజల బాటగా, ప్రజాస్వామ్య బాటగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

            ఈ కార్యక్రమంలో  వివిధ ప్రభుత్వ పథకాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, కృషి చేసిన ఐఎఎస్ అధికారులకు ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చి సత్కరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios