Asianet News TeluguAsianet News Telugu

మానస సరోవర్ యాత్రలో విషాదం: నేపాల్ లో హైదరాబాద్ మహిళ మృతి

 మానస సరోవర్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్ మహిళ నేపాల్ లో మృత్యువాత పడింది. హైదరాబాదులోని శేర్ లింగంపల్లికి చెందిన పుల్లిచర్ల లక్ష్మి ప్రతికూల వాతావరణం కారణంగా మరణించింది.

Hyderabad woman dies during yatra in Nepal

హైదరాబాద్: మానస సరోవర్ యాత్రకు వెళ్లిన హైదరాబాద్ మహిళ నేపాల్ లో మృత్యువాత పడింది. హైదరాబాదులోని శేర్ లింగంపల్లికి చెందిన పుల్లిచర్ల లక్ష్మి ప్రతికూల వాతావరణం కారణంగా మరణించింది. దాదాపు 60 మంది యాత్రికులతో కలిసి ఆమె మానస సరోవర్ యాత్రకు వెళ్లింది. 

ఈసారి యాత్రకు వెళ్లినవారిలో మొదటి మరణం ఇదే. నేపాల్ లోని సిమికోట్ లో పెద్ద యెత్తున మంచు పడడంతో యాత్రకు ఆటంకం ఏర్పడిన స్థితిలో మరో ముగ్గురు కూడా మరణించారు. 

లక్ష్మి జులై 4వ తేదీన సోనామార్గ్ లోని గంగవరం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆమె భర్త పుల్లిచర్ల రాజేంద్రను మరో ఆస్పత్రిలో చేర్చగా, దంపతులు విడిపోయారు. 

మానస సరోవర్ నుంచి తిరిగి వస్తుండగా తెలంగాణకు చెందిన 64 మంది యాత్రికులు నేపాల్ లో చిక్కుకుపోయారు. మొదటి విడత యాత్ర చేసిన 35 మంది తెలంగాణవాసులు గురువారంనాడు లక్నో చేరుకున్నారు. వారు శుక్రవారం హైదరాబాదు చేరుకునే అవకాశం ఉంది. 

లక్ష్మి భర్తకు ప్రాణాపాయం తప్పింది. కాగా, తప్పిపోయిన కొంత మందిని గుర్తించాల్సి ఉంది. లక్ష్మి మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో పంపడానికి ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నేపాల్ లోని భారత దౌత్య కార్యాలయాన్ని కోరింది. ప్రభుత్వమే ఆ ఖర్చులు భరిస్తుంది. 

స్వస్థలాలకు చేరుకోవడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గదులను కేటాయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios