హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లి చేసుకొన్న భార్యను నెల రోజుల తర్వాత నిర్మాణంలో ఉన్న భవనం నుండి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలతో ఆమె గురువారం నాడు రాత్రి మృత్యువాత పడింది.ఈ ఘటన హైద్రాబాద్ వనస్థలిపురంలో చోటు చేసుకొంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 26 ఏళ్ల దిలీప్  అదే రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల సీమ ప్రేమించుకొన్నారు.నెల రోజుల క్రితం  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనే వివాహం చేసుకొన్నారు.

బతుకు దెరువు కోసం హైద్రాబాద్‌కు వచ్చారు. హైద్రాబాద్ వనస్థలిపురం డివిజన్  చింతలకుంట సమీపంలోని శక్తినగర్‌ కాలనీలో వాసవి కన్‌స్ట్రక్షన్ సంస్థలో కూలీలుగా పనిచేస్తున్నారు.

వీరిద్దరూ కూడ ఇదే సంస్థలో నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్  పనులునిర్వహిస్తోంది. ఈ నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తూ తమ జీవనం గడుపుతున్నారు.

ఈ నెల 16వ తేదీన  భార్యాభర్తల మధ్య గొడవ చోటు చేసుకొంది. గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.దీంతో  అప్పటికే కోపంతో ఉన్న దిలీప్  భార్య సీమను మూడంతస్థుల భవనం నుండి  కిందకు నెట్టివేశాడు.

దీంతో  స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడు సీమ మృతి చెందింది. సీమ మృతి చెందిన విషయం తెలిసిన ఆమె సోదరుడు హైద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

భవనం నుండి కింద పడడంతో సీమ కాళ్లు , నడుము విరిగింది. తీవ్రంగా కొట్టి తన సోదరిని  దిలీప్ మూడంతస్తుల భవనం నుండి కిందకు నెట్టేశాడని  బాధితురాలి సోదరుడు పోలీసులకు చేసిన ఫిర్యాదులో వివరించారు.

నిందితుడు దిలీప్ పై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. హత్య కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు దిలీప్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవ వచ్చింది.. దిలీప్ సీమను ఉద్దేశ్యపూర్వకంగానే చంపాడా లేక కోపంలో ఆమెను భవనం నుండి కిందకు నెట్టివేశాడా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దిలీప్ ను అరెస్ట్ చేస్తే మరింత సమాచారం లభ్యమయ్యే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సీమ కుటుంబసభ్యులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారు. మధ్యప్రదేశ్‌లోనే  వివాహం చేసుకొన్న సీమ, దిలీప్ హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత  ఈ ఘటన చోటు చేసుకొంది. సీమను చంపేయాలనంత కోపం దిలీప్ కు ఎందుకు వచ్చిందనే విషయమై  తనకు తెలియదని సీమ సోదరుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా ఈ ఘటన సీమ బంధువుల్లో విషాదాన్ని నింపింది.,