హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వివరాలు.. ట్రిపుల్ ఐటీ జుంక్షన్ వద్ద ఉన్న సబ్ స్టేషన్ గేట్‌ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. 

మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందినవారిని అరవింద్ కుమార్ సహో(28),మునిష్ కునర్ సాకేత్(25)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని రాజ్ కుమార్(21) గా గుర్తించారు. మృతుల స్వస్థలం మధ్యప్రదేశ్ రాష్ట్రం సిద్ది జిల్లా. వీరు ముగ్గురు నానక్ రామ్ గూడ లోని ఓ రూంలో నివాసం వుంటున్నారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇక, సోమవారం చేవెళ్ల మండలంలోని కేసారం గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం తల్లీకూతుళ్లతో పాటు మరో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్‌లోని లింగపల్లి మయూరినగర్‌కు చెందిన భార్యభర్తలు రవికుమార్, స్రవంతి(30) వారి ఇద్దరు కూతూళ్లు మోక్ష, ధ్రువిక(5)తో కలిసి ఆల్టో కారులో హైదరాబాద్‌ నుంచి తాండూరు వైపు వెళ్తున్నారు. మరో వైపు వికారాబాద్‌ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఇన్నోవా వాహనం వేగంగా దూసుకొచ్చి.. ఎదురుగా వస్తున్న మూడు కార్లను ఢీకొట్టింది. అందులో రవికిరణ్ దంపతులు ప్రయాణిస్తున్న కారు కూడా ఉంది. ఈ ప్రమాదంలో తల్లి స్రవంతి, కూతురు ధ్రువికలు అక్కడికక్కడే మృతిచెందారు. తండ్రి రవికిరణ్, మరో కూతురు మోక్షలు తీవ్రంగా గాయపడ్డారు. 

అతి వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారులో ఉన్న ఫైజల్‌ కూడా మృతిచెందారు. ఈ ప్రమాదంలో మొత్తంగా ఏడుగురు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

ఇక, ఇన్నోవాకారులో ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులు ఆదివారం చేవెళ్లలోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహించిన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకోసం హాజరయ్యారు. రాత్రి అక్కడే ఉండి పార్టీ చేసుకుని, ఉదయాన్నే హైదరాబాద్‌ తిరుగుపయనమయ్యారు.