తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. ట్రూ కాలర్ మొబైల్ యాప్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఎన్నికలకు.. ట్రూ కాలర్ యాప్ కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? సంబంధం ఉంది. సాధారణంగా మనం ట్రూకాలర్ యాప్ దేనికి వాడతాం. మనకు తెలియని నెంబర్ నుంచి ఏదైనా ఫోన్ కాల్ వస్తే.. ఆ నెంబర్ ఎవరిది.. ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయం తెలుసుకోవడానికి వాడతం అవునా.. ప్రస్తుతం ఈ యాప్ ని తెలంగాణ ప్రజలు కొన్ని ఫోన్ కాల్స్ ఎత్తకుండా ఉండేందుకు వాడుతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్నికలు వచ్చాయనగానే.. కొన్ని పార్టీల నుంచి ఓటర్లకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మా పార్టీకే ఓటు వేయండి.. మమ్మల్ని గెలిపించండి ఇలా ఆ రికార్డెడ్ ఫోన్ కాల్ సందేశం. ఎంతో బిజిగా ఉన్న సమయంలో కాల్ రాగానే.. పని పక్కన పెట్టి మరీ ఎవరు ఫోన్ చేశారా అని లిఫ్ట్ చేస్తే.. తీరా అది ఎన్నికల అభ్యర్థుల నుంచి. ఇలా చాలా మందికి జరుగుతోంది.

దీంతో వారంతా ట్రూ కాలర్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. అందులో ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో లిఫ్ట్ చేయకముందే తెలుసుకోవచ్చు. దీంతో.. దానిని లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ యాప్ లో పలు పార్టీల నుంచి వచ్చే ఫోన్ కాల్స్.. ‘‘ ఎలక్షన్ హెరాస్మెంట్’’, ‘‘వోట్ బెగ్గర్’’, ‘‘ ఎలక్షన్ సర్వే’’, ‘‘బీజేపీ వోట్’’, ‘‘టీఆర్ఎస్ వోట్’’, ‘‘ఏపీ సీఎం’’, ‘‘టీఆర్ఎస్ పార్టీ’’ తదితర పేర్లతో ఓటర్లను అలర్ట్ చేస్తుంది.

దీంతో.. ఫోన్ ఎత్తాల్సిన పని ఉండదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘ఆఫీసు పనితో తీరిక లేకుండా ఉన్న సమయంలో రోజుకి  6 నుంచి 7 సార్లు ఈ ఓట్ల కోసం ఫోన్స్ వస్తున్నాయి. చాలా చిరాకుగా ఉంటోంది. అందుకే  ట్రూ కాలర్ యాప్ డౌన్ లోడ్ చేయాలనుకుంటున్నాను. ఎన్నికలు అయిపోగానే ఆ యాప్ ని డిలీట్ చేస్తాను’’ అని ఓ ఉద్యోగి తెలపడం విశేషం.