హైద్రాబాద్‌లో రోడ్డుపై కుప్పకూలిన వ్యక్తి: సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీస్ అధికారి
గుండెపోటు వచ్చిన వ్యక్తికి సకాలంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు ట్రాఫిక్ పోలీస్ అధికారి. ప్రస్తుతం బాధితుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
హైదరాబాద్:నగరంలోని బేగంపేట హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ట్రాఫిక్ పోలీస్ అధికారి కాపాడారు. వెంటనే బాధితుడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుడు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైద్రాబాద్ బేగంపేట మార్గంలో సీఎం వెళ్లే సమయంలో ట్రాఫిక్ బందోబస్తు విధులను నార్త్ జోన్ ట్రాపిక్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న గురజాల రాములు అనే వ్యక్తి రోడ్డుపై కుప్పకూలిపోయాడు.బాధితుడికి గుండెపోటు వచ్చిందని మధుసూధన్ రెడ్డి భావించాడు.వెంటనే రాములుకు మధుసూధన్ రెడ్డి సీపీఆర్ చేశారు. సీపీఆర్ చేయడంతో రాములులో కదలిక వచ్చింది.
వెంటనే అంబులెన్స్ ను రప్పించి రాములును గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. రాములు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. సకాలంలో సీపీఆర్ చేయడంతో రాములు ప్రాణాలు దక్కినట్టుగా వైద్యులు చెప్పారు. ఇదిలా ఉంటే పోలీస్ శాఖలో పనిచేసేవారికి సీపీఆర్ పై శిక్షణ ఇచ్చారు.గుండెపోటు వచ్చిన సమయంలో సకాలంలో సీపీఆర్ చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చని నార్త్ జోన్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూధన్ రెడ్డి చెప్పారు.
ఇదిలా ఉంటే సీపీఆర్ చేసి రాము ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీస్ అధికారి మధుసూధన్ రెడ్డిని తెలంగాణ మంత్రి హరీష్ రావు అభినందించారు.