సినిమాల్లో నటించాలని.. నటిగా రాణించాలని కలలు కనేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటి వాళ్లని టార్గెట్ చేసుకొని... డబ్బులు దండుకునే బ్యాచ్ కూడా చాలానే ఉంది. తాజాగా ఓ యువతి సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పగానే నమ్మి మోసపోయింది. తాను మోసపోయిన విషయం ఆలస్యంగా గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తూ హైదరాబాద్‌కు చేరుకుంది.ఎస్సార్‌ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఈమె సినిమాల్లో అవకాశాలు ఇచ్చే సంస్థల కోసం ఇంటర్నెట్‌లోనూ అన్వేషించింది. ఈ నేపథ్యంలో తనకు లభించిన ఓ నంబర్‌ను సంప్రదించింది. 

Also Read దొంగ ప్రేమ జంట... పెప్పర్ స్ప్రే చల్లి బంగారం చోరీ...

ప్రాథమిక చర్చలు పూర్తయిన తర్వాత ఆమెకు ఓ సినిమాలో హీరో సోదరి పాత్ర ఇస్తున్నట్లు సదరు వ్యక్తులు చెప్పారు. దీనికోసం రిజిస్ట్రేషన్‌తో పాటు ఇతర చార్జీలు చెల్లించాలన్నారు. దీనికి ఆమె అంగీకరించడంతో రూ.500తో ప్రారంభించి పలు దఫాల్లో రూ.30వేలు తన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేయించుకుని కాజేశారు. డబ్బు కట్టి చాలా రోజులు అవుతున్నా.. తనకు అవకాశం రాకపోవడంతో.. తాను మోసపోయానని యువతి ఆలస్యంగా గ్రహించింది. 

చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధిత యువతి సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.