డిసెంబర్ 10న తెలంగాణ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ.. !
Hyderabad: కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ 10న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం.

Telangana Cabinet meeting: కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాల నేపథ్యంలో డిసెంబర్ 10న మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో వరి సేకరణ, రైతుబంధు నిధుల విడుదల, భూమి ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణం, దళిత బంధు అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. టీఆర్‌ఎస్ నేతలు, మంత్రులపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు వంటి రాజకీయ అంశాలపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదిలావుండగా, గత కొంతకాలంగా కేంద్రంలో అధికారంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కారుకు, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య వైరం క్రమంగా పెరుగుతూనే ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలతో సోమవారంనాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఎల్లుండి నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలతో కేసీఆర్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించే యోచనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తే ఎలా ఉంటుందనే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టుగా సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో నిరసన వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందనే విషయమై పార్టీ ఎంపీలతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని సమాచారం. సమావేశాలు ప్రారంభమైన రోజున కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పార్లమెంట్ వేదికగా నిరసన వ్యక్తం చేసి సమావేశాలను బహిష్కరిస్తే ఎలా ఉంటుందనే విషయమై పార్టీ నేతలు చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరో వైపు సమావేశాలకు హాజరై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఎలా వ్యవహరిస్తుందనే విషయమై ఎండగడితే ఎలా ఉంటుందని వాదించే వారు కూడా లేకపోలేదు. ఈ విషయాలపై చర్చించిన తర్వాత ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.