హైద్రాబాద్ సరూర్నగర్ చెరువు నుండి నీటి విడుదల: నీట మునిగిన పలు కాలనీలు
హైద్రాబాద్ నగరంలోని సరూర్ నగర్ చెరువుకు సమీపంలోని కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. సరూర్ నగర్ చెరువు నుండి విడుదల చేసిన నీరు కాలనీలను ముంచెత్తింది.
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా సరూర్ నగర్ చెరువు నుండి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ఈ చెరువు కింద నివాసం ఉంటున్న కాలనీవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సరూర్ నగర్ చెరువు కింద ఉన్న కోదండరామనగర్, వీవీ నగర్ కాలనీలను సరూర్ నగర్ చెరువు నీరు ముంచెత్తింది. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోని రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు.
వర్షం వచ్చిన ప్రతిసారి ఈ కాలనీ వాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సరూర్ నగర్ చెరువు నిండిపోయింది. దీంతో సరూర్ నగర్ చెరువు నుండి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా చెరువు కింద ఉన్న కాలనీలను ముంచెత్తింది.
వర్షాకాలం వచ్చిందంటే సరూర్ నగర్ చెరువు కింద ఉన్న కాలనీవాసులు భయంతో గడపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో వరద నీరు చేరింది.
also read:మూసీకి పోటెత్తిన వరద: బీబీనగర్-పోచంపల్లి లోలెవల్ వంతెనపై నుండి వరద, రాకపోకలు బంద్
సోమవారంనాడు సాయంత్రం గంటన్నర పాటు హైద్రాబాద్ లో భారీ వర్షం కురిసింది.ఈ వర్షంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాలలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. హైద్రాబాద్ లో కూడ మంగళవారంనాడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. దీంతో గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని కోదండరామనగర్, వీవీ నగర్ తదతర కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.