హైదరాబాద్: హైద్రాబాద్ నగరం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరమని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.

 ఆదివారం నాడు హైద్రాబాద్ హెచ్‌ఐసీసీలో జరిగిన  హైసియా ఆధ్వర్యంలో బ్రాండ్ హైద్రాబాద్ కార్యక్రమంలో నిర్వహించిన  కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.భౌగోళికంగా హైద్రాబాద్ అత్యంత సేఫేస్ట్ సిటీ గా ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందన్నారు.

కేసీఆర్ పాలనలో శాంతిభద్రతల సమస్య తలెత్తలేదన్నారు.  తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం ఉందని చెప్పారు. ఈ కారణంగానే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టిన  సంస్థలకు అనేక సౌకర్యాలు కల్పించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పటికే ఉన్న సంస్థలే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతాయని కేసీఆర్ చెప్పిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు.

2014 కు ముందు అనేక సమస్యలుండేవని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో హైద్రాబాద్ సమస్యలు పరిష్కరిస్తున్నారని ఆయన చెప్పారు.హైద్రాబాద్ నగరాన్ని అత్యున్నత స్థితికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.పెట్టుబడిదారులకు అన్ని రకాల సౌకర్యాలను తమ ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.ఆరేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు కంటే ఎక్కువ పెరిగినట్టుగా ఆయన చెప్పారు.