వారిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెల్లెందుకు ఒప్పించారు. ఇలా కలిసి ఆనందంగా జీవించాలన్న వారి కలలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. ఈ ఘటన హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. 

 ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ శివారులోని కొంపల్లి మైసమ్మ గూడ నర్సింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు నిజాంపేట నుండి నిత్యం విద్యార్థులను తీసుకుని వెళ్లి తీసుకొస్తుంటుంది. రోజూ మాదిరిగానే శనివారం సాయంత్రం విద్యార్ధులను తీసుకుని  నిజాంపేట వైపు వస్తున్న బస్సు అదుపుతప్పి ఘోర ప్రమాదానికి కారణమయ్యింది. 

బస్సు డ్రైవర్ వేగంగా నడుపుతూ బస్సును అదుపుచేయడంతో విఫలమవడంతో ముందు వెళుతున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దీంతో  ఓ ప్రేమ జంట ప్రయాణిస్తున్న బైక్ తో పాటు మరో బైక్ ను ఢీ కొట్టింది. ఇలా ఆ ముగ్గురిపై నుండి బస్సు చక్రాలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రేమ జంట అరవింద్, అనంత లక్ష్మి లకు మరికొద్ది రోజుల్లో వివాహం కావాల్సి వుంది. ఇలాంటి సమయంలో వారిద్దరు ప్రమాదంబారిన పడి ఒకేసారి మృతిచెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. వీరితో పాటు చనిపోయిన మరో వ్యక్తి హయత్ నగర్ కు చెందిన ఏసేబు గా పోలీసులు గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులకు ఈ దుర్ఘటనపై సమాచారం అందించారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పరారీలో వున్న బస్సు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అతడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే మూడు నిండు ప్రాణాలు బలైనట్లు ప్రత్యక్ష సాక్షులు, బస్సులోని విద్యార్థులు చెబుతున్నారు.