పుడింగ్ అండ్ మింక్ పబ్ డగ్ర్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు.

పుడింగ్ అండ్ మింక్ పబ్ డగ్ర్స్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. పబ్‌లో కొకైన సరఫరా చేస్తున్నట్టుగా సమాచారం వచ్చిందని.. దీంతో తెల్లవారుజామున 2 గంటలకు పబ్‌లో సోదాలు నిర్వహించినట్టుగా పేర్కొన్నారు. క్లూస్‌ టీమ్‌కు కూడా సమాచారం ఇచ్చినట్టుగా చెప్పారు. పబ్‌లోకి వచ్చాక మేనేజర్‌ అనిల్‌కు పోలీసులు సమాచారమిచ్చినట్టుగా పోలీసలు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. పబ్ మేనేజర్ అనిల్ వద్ద ప్లాస్టిక్ ట్రేలో కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పారు. మొత్తం 5 ప్యాకెట్లలో 4.64 గ్రాముల తెల్ల పౌడర్ స్వాధీనం చేసుకున్నట్టుగా రిమాండ్ రిపోర్ట్‌లో ప్రస్తావించారు. 

పబ్‌లో ఉన్న పార్ట్‌నర్ అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పారు. అతడి మొబైల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. ఈజీ మనీ కోసమే డ్రగ్స్‌‌ను నిర్వాహకులు సరఫరా చేస్తున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఇక, నిందితులపై 1985 NDPS యాక్ట్ U/S 42 (2) కింద కేసు నమోదు చేశారు. 

ఇక, ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో దొరికిన డ్రగ్స్ మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయలో (araku valley) బయటపడినట్టుగా తెలుస్తోంది. అరకు ఏజెన్సీ నుంచి వీటిని తెప్పించినట్లు నార్కోటిక్స్ అనుమానం వ్యక్తం చేస్తోంది. డుంబ్రిగూడ మండలం లోగిలిలో నార్కోటిక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. గంజాయి కేసుల్లో నేరస్తుడైన మహేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పబ్‌లు, పార్టీలకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. మహేశ్‌ను హైదరాబాద్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది. అయితే స్థానిక పోలీసులు మాత్రం దీనిని ఇంకా ధ్రువీకరించలేదు.