హైదరాబాద్‌లో (Hyderabad) ఓ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. నారాయణగూడ‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి గుయోష్ పాషాను (60) దుండగలు కిడ్నాప్ (kidnap) చేశారు.

హైదరాబాద్‌లో (Hyderabad) ఓ వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. నారాయణగూడ‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి గుయోష్ పాషాను (60) దుండగలు కిడ్నాప్ (kidnap) చేశారు. కింగ్ కోఠిలోని ఈడెన్ గార్డెన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. నాంపల్లి లోని ఆగపురకు చెందిన షేక్ గుయోష్ పాషా నిన్న ఈడెన్ గార్డెన్స్ లో ఓ వివాహానికి హాజరయ్యాడు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను కిడ్నాప్ చేశారు. గుయోష్ పాషా కిడ్నాప్‌కు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన చోటుకు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. గుయోష్ పాషా కు వ్యాపారంలో ఎవరితోనైనా గొడువలున్నాయా..? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇక, గతేడాది హైదరాబాద్‌ అల్వాల్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే భాస్కర్‌ రెడ్డికి వరుసకు సోదరుడయ్యే తోట నరేందర్‌రెడ్డి నాటు తుపాకీతో కాల్చి చంపినట్టు పోలీసులు గుర్తించారు. టెంపుల్‌ అల్వాల్‌లోని శ్రీనివాసనగర్‌కు చెందిన తోట విజయ భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారు. కొన్ని ఉమ్మడిగా, మరికొన్ని వేర్వేరుగా నిర్వహించుకునేవారు. అయితే ఉమ్మడి లావాదేవీల్లో తేడాలు రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్దలు వచ్చాయి. 

ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నరేందర్‌ వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు. నకు రావాల్సిన కమీషన్‌ డబ్బులు ఇవ్వాలంటూ భాస్కర్‌రెడ్డిపై ఒత్తిడి చేశాడు. దీంతో వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే తుపాకీని కొనుగోలు చేసిన.. పక్కా ప్లాన్ ప్రకారం భాస్కర్ రెడ్డిని హత్య చేశాడు. భాస్కర్‌రెడ్డిని పెద్ద కబేళా పక్కన ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ తనకు రావాల్సిన కమీషన్‌ ఇవ్వాలంటూ వాగ్వాదానికి దిగాడు. అదును చూసి వెనుక నుంచి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విజయ్‌భాస్కర్‌రెడ్డి తలలోకి కాల్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు నరేందర్‌ రెడ్డిని అరెస్ట్ చేశారు.