గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం భాగ్యనగరం ముస్తాబవుతున్నది. ఈ నెల 31వ తేదీ నుంచి మహానగరం గణపయ్య విగ్రహాలు, గణేష్ మహారాజ్ కీ జై వంటి నినాదాలతో శోభిల్లుతుంది. నిర్వాహకులు ఇప్పటికే తమ పనుల్లో నిమగ్నం కాగా.. భక్తులు ఈ ఉత్సవాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేస్తున్నది.
హైదరాబాద్: ఈ నెల 31న వినాయక చవితి కావడంతో ఇప్పటికే రాజధాని నగరంలో కోలాహలం మొదలైంది. చిన్న చిన్న మండపాల్లో వినాయకుల కోసం ఇప్పటికే నిర్వాహకులు కొనుగోళ్లు ప్రారంభించారు. ముందస్తుగా తెచ్చుకుని సిద్ధంగా ఉంచుకున్నారు. కాగా, పెద్ద మండపాల్లో నిర్మాణాలూ పూర్తయ్యాయి. వినాయక చవితి కోసం మండపాల్లో ఇతర ఏర్పాట్లనూ రెడీ చేస్తున్నారు. ప్రభుత్వం మట్టి విగ్రహాలతో ఉత్సవాలు జరుపుకోవాలని సూచనలు చేస్తున్నది. ఉచితంగా వాటిని పంపిణీ చేస్తూ ప్రోత్సహిస్తున్నది. కానీ, కొన్ని మండపాల్లో ఇప్పటికీ పీవోపీ విగ్రహాలు దర్శనం ఇస్తున్నాయి. అయితే, భారీ కాయుడిగా కొలువుదీరుతున్న ఖైరతాబాద్ గణేషుడు మాత్రం మట్టితో రూపం పోసుకున్నాడు.
మొన్నటి వరకు బోనాల సందడితో ఉత్సాహాలు వెల్లివిరిసిన హైదరాబాద్ నగరం మరో వేడుకకు రెడీ తయారవుతున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందస్తుగానే చర్యలకు ఉపక్రమించింది. భద్రతా ఏర్పాట్లు సహా నిమజ్జనం, ఇతర విషయాలపై ముందస్తుగా మండపాల నిర్వాహకులకు సూచనలు చేస్తున్నది.
ఈ ఉత్సవాల పై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం మాట్లాడారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని ఆయన తెలిపారు. భక్తులకు, మండపాల నిర్వాహకులకు అవాంతరాలు, ఆటంకాలు లేకుండా ఉత్సవాలు సంబురంగా జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వివరించారు.
ఖైరతాబాద్ మహాగణపతి గురించి తెలియని వారు ఉండరని ఈ సందర్భంగా మంత్రి తలసాని అన్నారు. ఖైరతాబాద్ గణేషుడి దగ్గరకు వేర్వేరు ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు వస్తారని వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మండపం దగ్గర బలమైన బారికేడ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్కడే ఆరోగ్య శాఖ ఒక మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేస్తుందని వివరించారు. అటు వైపుగా నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు వాహనాలను నిలిపేస్తామని, అలాగే, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు రాకుండా జెనరేటర్లూ ఏర్పాటు చేస్తామని వివరించారు. అలాగే, ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో తాత్కాలిక టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
నిమజ్జనం గురించి కూడా ఇప్పుడే కసరత్తులు మొదలయ్యాయి. నగరంలో ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్ పాండ్స్ (24 పాండ్స్ నిర్మించనున్నారు.) ఏర్పాటు చేయనున్నారు. నగర వ్యాప్తంగా వీటిని నిర్మిస్తారు. అదే విధంగా నగరంలో కొత్తగా 22 తాత్కాలిక కొలనులను జీహెచ్ఎంసీ తవ్వించనుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో నిర్మించిన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ ఏడాది నుంచి వర్తించనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నది.
