హైదరాబాద్ లో వర్షం జోరుగా కురుస్తుంది. మరో రెండు గంటలపాటు ఈ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేడు తీవ్ర  రూపం దాల్చాయి. 

ఉదయం వాయుగుండం తీరం దాటింది మొదలు ఇక్కడ వర్షాల జోరు పెరిగింది. నేటి మధ్యాహ్నం హైదరాబాద్ పక్కనున్న వలిగొండలో 22 సెంటీమీటర్ల వాన నమోదు అయింది సాయంత్రానికి మేఘాలు హైదరాబాద్ మీద కుండపోత వర్షాన్ని కురిపిస్తున్నాయి. 

నేటి అర్థరాత్రి వరకు భారీ వర్షం కొనసాగే సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలెవ్వరూ తమ ఇండ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని పడవల సహాయంతో తరలిస్తున్నారు సహాయక సిబ్బంది. 

విపత్తు బృందాలు, మునిసిపల్ సిబ్బంది, పోలీసులు అందరూ రోడ్ల మీద సిద్ధంగా ఉన్నారు. విద్యుత్ అధికారులు, రెవిన్యూ సిబ్బంది సైతం అందుబాటులో ఉన్నారు. అధికారులు హైదరాబాద్ కి ఆరంజ్ అలెర్ట్ ను విడుదల చేసారు. 

తూర్పు హైదరాబాద్ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో 10 గంటల తరువాత నుండి ఒకింత ఉపశమనం లభించవచ్చని, మొత్తం సిటీ లో వర్షాలు అర్థరాత్రి దాటాక తగ్గుముఖం పెట్టొచ్చని సమాచారం.