రాజాసింగ్ అరెస్ట్: హైద్రాబాద్ పాతబస్తీలో పోలీసుల హైఅలెర్ట్
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో హైద్రాబాద్ పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. నగరంలోని సున్నితమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో హైద్రాబాద్ లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. 2004 నుండి రాజాసింగ్ పై నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకొని పీడీయాక్ట్ ను నమోదు చేశారు పోలీసులు. నిన్న మధ్యాహ్నమే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
ఇదిలా ఉంటే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో బేగం బజార్, ఎంజె మార్కెట్ ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు మూసివేసి నిరసనకకు దిగారు. రాజాసింగ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతుదారులు కూడా ఇవాళ ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉన్నందున పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకే సమయంలో రాజసింగ్ అనుకూల,వ్యతిరేక వర్గాలు ఎదురు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు.
also read:శాంతియుతంగా ప్రార్థనలు నిర్వహించండి.. ముస్లింలకు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పిలుపు
హైద్రాబాద్ పాతబస్తీలో శుక్రవారం నాడు ముస్లింలు సామూహిక ప్రార్ధనలు నిర్వహిస్తారు . అయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించవద్దని హైద్రాబాద్ ఎంపీ , ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు పిలుపునిచ్చారు.
గురువారం నాడు రాత్రే ముస్లిం మత పెద్దలతో పోలీసులు చర్చలు జరిపారు. శుక్రవారం నాడు ప్రార్ధనల సందర్భంగా ఆందోళనలు నిర్వహించకుండా చూడాలని పోలీసులు మత పెద్దలను కోరారు.
రాజాసింగ్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన వీడియోపై హైద్రాబాద్ పాతబస్తీలో ఆందోళనలు సాగాయి. శాలిబండ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో కేంద్ర బలగాలను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పాతబస్తీలో ని సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తుంది. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
యూట్యూబ్ లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అప్ లోడ్ చేసిన వీడియో హైద్రాబాద్ లో టెన్షన్ కు కారణమైంది. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపిస్తుంది.ఈ విషయమై రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ నెల 23న రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నిన్న మధ్యాహ్నం రాజాసింగ్ పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. అంతేకాదు ఆయనను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.