ఇంతకాలం పెట్రోలింగ్ అంటే కేవలం మగ పోలీసులు మాత్రమే నిర్వహించేవారు. అయితే శాంతిభద్రతలు, ఈవ్ టీజింగ్‌, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశలో మరో అడుగు ముందుకేసింది.

దీనిలో భాగంగా ‘‘విమెన్ ఆన్ వీల్స్’’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రకారం హైదరాబాద్‌లో ఇకపై మహిళా కానిస్టేబుల్స్ మోటారు సైకిళ్లపై పెట్రోలింగ్‌ నిర్వహించనున్నారు.

నగరంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు నగర అడిషనల్ కమిషనర్ శిఖా గోయెల్ తెలిపారు. 20 టీం మహిళా కానిస్టేబుల్స్ హైదరాబాద్‌లోని 17 సబ్‌ డివిజన్లలో పెట్రోలింగ్‌లో పాల్గొంటారని ఆమె తెలిపారు.

పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్  అయిన 100కు వచ్చే ఫోన్‌ కాల్స్‌ని కూడా వీరు స్వీకరించి మహిళలకు అండగా నిలుస్తారని తెలిపారు. ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా లేదంటే అసభ్యంగా ప్రవర్తించినా వెంటనే 100కు డయల్ చేయాలని శిఖా గోయెల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

‘‘విమెన్ ఆన్ వీల్స్’’కు ముందు 47 మంది మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేసి, వారికి రెండు నెలల పాటు పెట్రోలింగ్, బ్లూకోట్స్ విధి, డ్రైవింగ్ నైపుణ్యం, డయల్ 100 నుంచి వచ్చే సమాచారంతో ఘటనాస్థలికి ఎలా చేరుకోవాలని అన్న వాటిపై శిక్షణ ఇచ్చారు.