సోషల్ మీడియాలో పోస్టులు: తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ సహా మరో ముగ్గురికి నోటీసులు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ సహా మరో ముగ్గురికి సైబర్ క్రైమ్ పోలీసులు 41 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం హైద్రాబాద్ మాదాపూర్ లోని సునీల్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులిచ్చారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు సహా మరో ముగ్గురికి సైబర్ క్రైమ్ పోలీసులు గురువారంనాడు నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ మాదాపూర్ లో ఉన్న సునీల్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ పై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు అందినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కార్యాలయాన్ని సీజ్ చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సునీల్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. సునీల్ సూచనలు, సలహల మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సునీల్ కార్యాలయంలో తమ పార్టీకి చెందిన డేటాను తీసుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.సునీల్ కార్యాలయంలో పనిచేసే సిబ్బందిని అక్రమంగా నిర్భంధించారని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
మహిళలను కించపర్చేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు అందడంతో సునీల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించినట్టుగా సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు.వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో సునీల్ ను కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా నియమించుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి సునీల్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.సునీల్ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఇతర పార్టీల పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సమాచారం ఇస్తున్నారు. గతంలో రాహుల్ గాంధీ తెలంగాణ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈ సమావేశంలో సునీల్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలకు పలు సూచనలు, సలహలు ఇచ్చారు. పార్టీ బలోపేతం నేతలంతా ఐక్యంగా ఉండాలని ఆ సమయంలో రాహుల్ గాంధీ సూచించారు.