Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసు.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. నేడు కోర్టు ముందుకు నిందితులు..

దసరా వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు వ్యక్తులను నగర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. 
 

hyderabad police investigation on Terror attack plot case
Author
First Published Oct 3, 2022, 11:47 AM IST

దసరా వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉగ్రదాడికి కుట్ర పన్నిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారి నుంచి పాకిస్థాన్‌కు చెందిన నాలుగు హ్యాండ్ గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర నిఘా వర్గాలు, టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు, సీసీఎస్‌ పరిధిలోని స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌(సిట్‌) బృందాలు.. పక్కా స్కెచ్‌తో ఉగ్ర కుట్రను భగ్నం చేశాయి. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు కొసాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు.. రిమాండ్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. అలాగే సీజ్ చేసిన మెటీరియల్, ప్రాసిక్యూషన్ ఏవిడెన్స్‌ను సేకరిస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను సిట్ అధికారులు ఈ రోజు  కోర్టులో హాజరుపరచున్నారు. అనంతర వారిని కస్టడీలోకి తీసుకుని విచారించాలని చూస్తున్నారు. 

ఇక, హైదరాబాద్‌లో ఉగ్ర దాడికి ప్లాన్ చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. “ఈ ముగ్గురు వ్యక్తులు పండుగ సందర్భంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో గ్రెనేడ్లు విసిరేందుకు ప్లాన్ చేస్తున్నారు. నిర్దిష్ట సమాచారం మేరకు మలక్‌పేట్‌లోని ఓ స్థలంపై దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేసి నాలుగు హ్యాండ్‌ గ్రెనేడ్‌లు, దాదాపు 5.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం’’అని  సీవీ ఆనంద్ తెలిపారు. 

గ్రెనేడ్ దాడులకు ప్లాన్ చేసిన ప్రధాన నిందితుడు, సూత్రధారి జాహెద్ అబ్దుల్‌తో పాటు మరో ఇద్దరిని మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీ (39), మాజ్ హసన్ ఫరూఖ్ అలియాస్ మాజ్ (29)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నవరాత్రి, దసరా వేడుకల సమయంలో గ్రెనేడ్లను ఉపయోగించి వీలైనంత ఎక్కువ విధ్వంసం చేయాలని వీరికి  పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ నుంచి ఆదేశాలు అందయాని చెప్పారు. 

జాహెద్ గతంలో నగరంలో పలు ఉగ్రదాడులకు సంబంధించిన కేసుల్లో ప్రమేయం ఉన్నాడని, పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ-ఎల్‌ఈటీ హ్యాండ్లర్లతో నిత్యం టచ్‌లో ఉండేవాడని తెలిపారు. “జాహెద్ అతని ఐఎస్‌ఐ హ్యాండ్లర్ నుంచి నాలుగు గ్రెనేడ్లను అందుకున్నాడు. హైదరాబాద్‌లో సంచలనాత్మక ఉగ్రదాడి చేయమని అతనికి చెప్పబడింది. మేము దానిని విఫలం చేయగలిగాం’’ అని సీవీ ఆనంద్ తెలిపారు. ఇక, జాహెద్ తీవ్రవాద కార్యకర్త షాహిద్ బిలాల్ సోదరుడని పోలీసులు భావిస్తున్నారు. జహెద్ నిత్యం ఐఎస్‌ఐ హ్యాండ్లర్లతో టచ్‌లో ఉంటున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గతంలో 2005లో బేగంపేటలోని సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై ఆత్మాహుతి దాడి వంటి ఉగ్రవాద సంబంధిత కేసుల్లో అతడి ప్రమేయం ఉంది. 

“ఫర్హతుల్లా ఘోరీ, అబు హంజాలా, మజీద్‌లు అతనితో వారి పరిచయాలను పునరుద్ధరించుకున్నారని.. హైదరాబాద్‌లో మళ్లీ ఉగ్రవాద దాడులను రిక్రూట్ చేయడానికి, దాడులు చేయడానికి వారు అతనిని ప్రేరేపించారని, ఆర్థిక సహాయం చేశారని అబ్దుల్ జాహెద్ విచారణలో వెల్లడించాడు. పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ల ఆదేశానుసారం జాహెద్.. సమీయుద్దీన్, మాజ్ హసన్‌లను నియమించుకున్నాడు” అని పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరు నిందితుల కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు.

ఆదివారం సోదాల్లో భాగంగా పోలీసులు జాహెద్‌ నుంచి రెండు హ్యాండ్‌ గ్రెనేడ్‌లు, రూ.3,91,800 నగదు, రెండు మొబైల్‌ ఫోన్‌లు.. సమీయుద్దీన్‌ నుంచి హ్యాండ్‌ గ్రెనేడ్‌, రూ.1.50 లక్షల నగదు, మొబైల్‌ ఫోన్‌, మోటార్‌సైకిల్‌.. మాజ్ నుంచి ఒక హ్యాండ్‌ గ్రెనేడ్‌, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios