మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు: హైద్రాబాద్ డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో కేసు
మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైద్రాబాద్ డబీర్ పురా పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఆందోళనకు దిగింది.
హైదరాబాద్: మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైద్రాబాద్ డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మునావర్ ఫరూఖీకి సంబంధించిన కామెడీ షో కి సంబంధించి రాజాసింగ్ విడుదల చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది..ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై ఎంఐఎం పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది. రాజాసింగ్ పై చర్యలు తీసకోవాలని కోరుతూ హైద్రాబాద్ సీపీ కార్యాలయం ముందు ఎంఐఎం కార్యకర్తలు సోమవారం నాడు రాత్రి ఆందోళనకు దిగారు.
అంతేకాదు మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. అయితే డబీర్ పురా పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. . హైద్రాబాద్ సీపీ కార్యాలయం ముందు రాత్రి నుండి ఎంఐఎం కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెల 20వ తేదీన హైద్రాబాద్ లో మునావర్ ఫరూఖీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని రాజాసింగ్ ప్రకటించారు. ఓ వర్గం దేవతలను కించపర్చేలా మునావర్ ఫరూఖీ వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ గుర్తుచేశారు. అలాంటి మునావర్ ఫరూఖీ కార్యక్రమం హైద్రాబాద్ లో నిర్వహించడంలో అర్ధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకొంటామని కూడా రాజాసింగ్ చెప్పారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఈ కార్యక్రమం ముగిసింది. పోలీస్ వేషంలో ఈ షో ను అడ్డుకొనేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
పార్టీ కంటే ధర్మ రక్షణే తనకు ముఖ్యమని కూడా రాజాసింగ్ ప్రకటించారు. అవసరమైతే పార్టీ తనపై చర్యలు తీసకోన్న ఇబ్బంది లేదని మునావర్ షో విషయమై మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు.