నాగోలు మహదేవ్ జ్యుయలరీ కేసులో పురోగతి: పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
హైద్రాబాద్ నగరంలోని నాగోలు మహదేవ్ జ్యుయలరీ దోపీడీకి పాల్పడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ కెమెరాల ట్రాకింగ్ ద్వారా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్:నగరంలోని నాగోలు మహదేవ్ జ్యుయలరీ దోపీడీ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. సీసీ కెమెరాల లైవ్ ట్రాకింగ్ ద్వారా దోపీడీకి పాల్పడిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మిగిలిన నలుగురిని పోలీసులు పట్టుకున్నారు.ఈ నెల 1వ తేదీన రాత్రి నాగోలు స్నేహపురి కాలనీలో గల మహదేవ్ జ్యుయలరీ షాపులో నలుగురు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపి బంగారాన్ని దోచుకున్నారు.ఈ ఘటనలో జ్యుయలరీ షాపు యజమాని కళ్యాణ్ సింగ్, షాపులో ఉన్న మరో వ్యక్తి గాయపడ్డారు.
డిసెంబర్ 1వ తేదీన రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో దుకాణం వద్దకు వచ్చిన దుండగులు పథకం ప్రకారంగా దోపీడీకి పాల్పడ్డారు. బంగారు ఆభరణాల హోల్ సేల్ వ్యాపారం చేసే సుఖ్ రామ్, రాజ్ కుమార్ లు మహదేవ్ బంగారం దుకాణానికి ఈ నెల 1వ తేదీన రాత్రి వచ్చారు. దుకాణంలోకి బంగారం వ్యాపారులు వెళ్లగానే దుండగులు కూడా జ్యుయలరీ షాపులోకి వెళ్లి తుపాకీతో బెదిరించారు. బంగారం బ్యాగును ఇవ్వాలని కోరారు. ఈ సమయంలో బంగారం దుకాణంలో ఉన్న వారు దుండగులను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పెనుగులాట చోటు చేసుకుంది. దుండగులు తమ వెంట తెచ్చుకున్న తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులకు దిగారు. దీంతో దుకాణం యజమాని కళ్యాణ్ సింగ్, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ కాల్పుల శబ్దం విన్న పక్కనే ఉన్న వారు దుకాణం షట్టర్ ఓపెన్ చేశారు. వెంటనే దుండగులు రెండు బైక్ లపై పారిపోయారు.
also read:హైద్రాబాద్ నాగోల్ జ్యుయలరీ షాపులో కాల్పులు, ఇద్దరికి గాయాలు: బంగారం చోరీ
నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. సీసీటీవీ లైవ్ ట్రాకింగ్ ఆధారంగా తొలుత ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్రలో ఉన్న మరో ముగ్గురిని పోలీసుులు అదుపులోకి తీసుకున్నారు. మహదేవ్ జ్యుయలరీ దుకాణంలో దుండగులు చోరీ చేసిన బ్యాగులో కిలో బంగారంతో పాటు రూ. 1.70 లక్షల నగదు కూడా ఉందని పోలీసులు గుర్తించారు. మరో వైపు ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు నాగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను రాచకొండ సీపీ ఈ నెల 2న పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే.