Asianet News TeluguAsianet News Telugu

జియాగూడ హత్య కేసును చేధించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..

హైదరాబాద్‌లోని జియాగూడలో నడిరోడ్డుపై సాయినాథ్‌ అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు చేధించారు.

hyderabad police detain three in jiyaguda murder case
Author
First Published Jan 23, 2023, 2:40 PM IST

హైదరాబాద్‌లోని జియాగూడలో నడిరోడ్డుపై సాయినాథ్‌ అనే యువకుడిని ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా దాడి చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ హత్య కేసును చేధించారు. సాయినాథ్‌ను అతని స్నేహితులే హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఆర్థిక కారణాలతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు నిర్దారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక, నిందితులను అక్షయ్, టిల్లు, సోనూలుగా గుర్తించారు. 

హైదరాబాద్ కుల్సుంపురా పోలీసు స్టేషన్‌ పరిధిలోని జియాగూడ-పురానాపూల్ రహదారి మధ్యలో ఆదివారం సాయంత్రం అంబర్‌పేటకు చెందిన కార్పెంటర్ జంగం సాయినాథ్‌ను ముగ్గురు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణానికి పాల్పడ్డారు. తొలుత సాయినాథ్‌పై ఇద్దరు వ్యక్తులు కొడవలి, ఇనుప పైపుతో దాడి చేశారు. సాయి‌నాథ్ రోడ్డుపై పడిపోయినప్పుడు.. మూడో వ్యక్తి అతడు తప్పించుకోకుండా అతని కాళ్ళను పట్టుకున్నాడు. అయితే ఈ ఘటన జరగుతున్న సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఎవరూ కూడా ఆపేందుకు ప్రయత్నం చేయలేదు. కొందరు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వారి సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. 

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాయినాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఐపీసీ సెక్షన్ 302 కింద హత్య కేసు నమోదు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios