గంగా జమున తెహజీబ్: గణపతి నిమజ్జనంలో భక్తులతోపాటు పోలీసుల స్టెప్పులు.. నగరంలో వెల్లివిరిసిన మతసామరస్యం (Videos)
గణపతి నిమజ్జన ఊరేగింపులో హైదరాబాద్ పోలీసులు భక్తులతోపాటు స్టెప్పులు వేశారు. శాంతి భద్రతలు కాపాడే బాధ్యతలు నిర్వర్తిస్తూనే వారు ఉల్లాసంగా ఈ ఊరేగింపులో పాలుపంచుకోవడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్: నగరంలో గణపతి నిమజ్జన కార్యక్రమాలు విజయవంతంగా, శాంతియుతంగా జరుగుతున్నాయి. నిమజ్జనం రోజున హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్డుపై ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు గుమిగూడి ఉత్సవాలు చేసుకుంటారు. భక్తులూ భారీగా ఉండటంతో శాంతి భద్రతల కోసం మోహరించే పోలీసు సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది. భక్తులు ఆటపాటలు, డ్యాన్సులతో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తిస్తుంటారు. ఈ సారి మాత్రం పోలీసులు ఓ అడుగు ముందుకు వేసి హుషారుగా కాలు కదిపారు. భక్తులతోపాటు ఊరేగింపులో వారు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. భక్తులతో కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.
ఈ సారి గణపతి నిమజ్జనంపై కొందరిలో సంకోచాలు, భయాలూ నెలకొన్నాయి. మిలాద్ ఉన్ నబీ, గణపతి నిమజ్జనం ఒకే రోజు రావడంతో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకునే ముప్పును అంచనా వేశారు. హైదరాబాద్‌లో పాతబస్తీ సహా మిగిలిన ఏరియాల్లోనూ ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గణపతి నిమజ్జనం నగరంలో పెద్ద ఎత్తున జరుగుతుందని తెలిసిందే. ఈ రెండు ఒకే రోజున వచ్చినప్పటికీ నగరంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకోలేవు. అంతేకాదు, మతసామరస్యత వెల్లివిరిసింది. గణపతి నిమజ్జనాన్ని దృష్టిలో పెట్టుకుని మిలాద్ ఉన్ నబీ కోసం తీసే ర్యాలీని మర్కాజీ మిలాద్ జులూస్ కమిటీ అక్టోబర్ 1వ తేదీకి వాయిదా కూడా వేసింది.
Also Read: ఏఐఏడీఎంకే, బీజేపీ పొత్తు ఎందుకు ముగిసింది? బీజేపీకి గడ్డుకాలమేనా? పొత్తుల చరిత్ర ఏమిటీ?
ఈ ఏడాది గణపతి నిమజ్జనం మరోసారి హైదరాబాద్‌లోని మతసారమస్యాన్ని వెల్లడించింది. ఒక మతాన్ని మరో మతం వారు గౌరవించుకోవడం స్పష్టంగా కనిపించింది. ముస్లింలు మిలాద్ ఉన్ నబీ ఊరేగింపును అక్టోబర్ 1వ తేదీకి వాయిదా వేసుకున్నట్టు సియాసత్ పత్రిక రిపోర్ట్ చేసింది. గణపతి నిమజ్జనం అదే రోజు రావడం వల్లే వాయిదా వేసినట్టు తెలిపింది. ప్రతి ఏడాది ఊరేగింపు సేమ్ డే నాడే నిర్వహిస్తారు. కానీ, ఈ సారి నిమజ్జనం సెప్టెబర్ 28వ తేదీన రావడంతో వారు తమ ఊరేగింపును వాయిదా వేసుకున్నారు.
మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు చెబుతూ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సామాజకి, ఆర్థిక, ఆధ్యాత్మిక వృద్ధి లక్ష్యంగా ఉన్నాయని, ఈ పథకాలు ఆశించిన ఫలితాలను రాబడుతున్నాయని వివరించారు. తెలంగాణలో గంగా జముని తెహజీబ్ సూత్రాన్ని కాపాడలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు.