హైదరాబాద్ పోలీసు దంపతుల ప్రీవెడ్డింగ్ షూట్ వైరల్.. ఇలా చేయడానికి ముందు.. : సీనియర్ సలహా
హైదరాబాద్ పోలీసు దంపతులు ప్రీవెడ్డింగ్ షూట్ వైరల్ అయింది. రెండు నిమిషాల ఆ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఓ సీనియర్ పోలీసు అధికారి సూచన ఇచ్చాడు.
హైదరాబాద్: ఇటీవల ప్రీవెడ్డింగ్ షూట్ చాలా కామన్ అయిపోయింది. పెళ్లి వేడుకలో భాగంగా మారిపోయింది. ఇతరుల కంటే భిన్నంగా, ప్రత్యేకంగా తమ పెళ్లి ఉండాలనే తపనతో ప్రీవెడ్డింగ్ షూట్ కూడా సాధ్యమైనంత వైవిధ్యంగా ఉండేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ పోలీసు దంపతులు కూడా తమ ప్రీవెడ్డింగ్ షూట్ సినిమాటిక్ సీన్‌లతో నింపేశారు. ఇందులో వారు పోలీసు యూనిఫామ్‌లోనూ కనిపించారు. ఈ రెండు నిమిషాల వీడియో సోషల్ మీడియాలో సంచలనమైంది. నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఓ సీనియర్ పోలీసు అధికారి ఇలా చేసే వారికి ఓ సూచన, హెచ్చరిక ఇవ్వాల్సి వచ్చింది.
రెండు నిమిషాల ఆ ప్రీవెడ్డింగ్ క్లిప్‌లో వారిద్దరూ పోలీసు యూనిఫామ్‌లో ఉన్నారు. పోలీసు వెహికిల్స్ వాడారు. ఆ పోలీసుల అధికారిణి పోలీసు కారులో నుంచి దిగి ఓ కేసు వివరాలు అడుగుతున్నట్టు కనిపించింది. అదే సమయంలో గేటులోకి మరో కారులో పోలీసు ఆఫీసర్ వచ్చి స్టైల్‌గా కిందికి దిగుతాడు. ఈ సీక్వెన్స్ తర్వాత ఓ తెలుగు పాటకు స్టెప్పులేశారు. హైదరాబాద్‌లోని చార్మినార్, లాల్ బజార్, అలాగే, బీచ్‌లోనూ షూట్ చేశారు.
ఈ వీడియో వైరల్ అయింది. కొందరు నెటిజన్లు ఈ దంపతులు పబ్లిక్ ప్రాపర్టీ అయిన పోలీసు వాహనాలు, యూనిఫామ్ వాడటంపై అభ్యంతరం తెలిపారు. మరికొందరు వీడియోపై ప్రశంసలు కురిపించారు.
ఒక సాధారణ పౌరుడు ఏదైనా రికార్డ్ చేయాలని ప్రయత్నిస్తే వాళ్లు మొబైల్ ఫోన్ బయట పడేస్తారని, కానీ, పోలీసులు మాత్రం ప్రభుత్వ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వెహికిల్స్‌ను వారి ప్రైవేట్ ఈవెంట్ కోసం దుర్వినియోగం చేయవచ్చా? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. మరొకరు టాలీవుడ్ వీరి గురించి ఆలోచించాలని కామెంట్ చేశారు.
Also Read: India Rising: ప్రపంచ దేశాలపై భారత డిజిటల్ ముద్ర.. జీ20 న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో డీపీఐపై ఏకాభిప్రాయం
అయితే.. ఈ వీడియోపై సీనియర్ పోలీసు అధికారి సీవీ ఆనంద్ కూడా స్పందించారు. ఈ వీడియోకు మిశ్రమ స్పందన వచ్చిందని, వారు పెళ్లి కోసం ఓవర్ ఎగ్జైట్ అయ్యారని, అది మంచి వార్తేనని పేర్కొన్నారు. అయితే, కొంత ఇబ్బందిని కూడా కలిగించారని తెలిపారు. పోలీసింగ్ అనేది చాలా టఫ్ జాబ్ అని, ముఖ్యంగా మహిళలకు మరింత టఫ్ అని వివరించారు. ఆమె పోలీసు అధికారినే జీవిత భాగస్వామిగా ఎంచుకోవడం ఆనందించదగ్గ విషయం అని తెలిపారు. వారిద్దరూ పోలీసు అధికారులేనని, పోలీసు డిపార్ట్‌మెంట్ ప్రాపర్టీ, సింబల్‌ను వారు వినియోగించడంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని వివరించారు. అయితే.. వారు ముందుగా సమాచారం ఇచ్చి అనుమతి కోసం అడిగితే తప్పకుండా పర్మిషన్ ఇచ్చేవారని పేర్కొన్నారు. ఈ పని చేయకపోవడం వల్ల తమలో కొందరికి ఈ పరిణామంపై కోపం వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. అయితే.. ఇతరులు ముందస్తు అనుమతి లేకుండా ఇలా చేయవద్దని సూచిస్తున్నట్టు వివరించారు.
ఆగస్టులో పెళ్లి చేసుకున్న ఆ దంపతుల పేర్లు రావూరి కిశోర్, కే భావన.