హైదరాబాద్ కేంద్రంగా క్యూ నెట్ విహాన్ డైరెక్టు సెల్లింగ్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్న వ్యవహారంలో కీలక నిందితుడు ఉపేంద్రనాథ్ రెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ కేంద్రంగా క్యూ నెట్ విహాన్ డైరెక్టు సెల్లింగ్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్న వ్యవహారంలో కీలక నిందితుడు ఉపేంద్రనాథ్ రెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరు నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉపేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నట్టుగా సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న హైదరాబాద్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచి.. తర్వాత హైదరాబాద్‌కు తరలించి అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లోని కాల్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఈ సంస్థకు చెందిన ఆరుగురు ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. దీంతో క్యూ నెట్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కొన్నేళ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం మల్టీమార్కెటింగ్‌పై నిషేధం విధించడంతో క్యూనెట్ కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే రాజేష్ కన్నా, ఉపేంద్రనాథ్ రెడ్డిలు మరికొందరితో కలిసి సంస్థ పేరుమార్చి విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడుతున్నారు.
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ ఘటన విచారణలో ఈ మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం బయటపడింది. నిందితులు నిరుద్యోగ యువకులు, అమాయక ప్రజల నుంచి అధిక రాబడి వస్తుందని వాగ్దానం చేసి డబ్బు వసూలు చేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే మహంకాళి పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. అనంతరం ఈ కేసులు సీసీఎస్ బదిలీ చేశారు. రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు ఈ ఏడాది మే 30న క్యూనెట్ ప్రధాన నిర్వాహకుడు రాజేష్ ఖన్నాను అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడైన ఉపేంద్రనాథ్ గురించి అన్వేషణ కొనసాగిస్తున్న పోలీసులు.. తాజాగా అతడిని అరెస్ట్ చేశారు.
