హైదరాబాద్: మౌనరాగం సీరియల్ ఆర్టిస్టు శ్రావణి ఆత్మహత్య కేసులో సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. ఆర్ఎక్స్ సినిమా నిర్మాత ఆశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా చెప్పారు. 

సోమవారం నాడు జాయింట్ సీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో ఏ1 సాయికృష్ణారెడ్డి, ఏ2గా నిర్మాత ఆశోక్ రెడ్డి, ఏ3గా దేవరాజు రెడ్డిని చేర్చినట్టుగా జాయింట్ సీపీ చెప్పారు. దేవరాజురెడ్డిని కలవొద్దని శ్రావణిపై ఆమె కుటుంబసభ్యులు ఒత్తిడి తెచ్చారని ఆయన చెప్పారు. శ్రావణి కుటుంబసభ్యులెవరిని ఈ కేసులో నిందితులుగా చూడడం లేదన్నారు. 

2015లో సాయికృష్ణారెడ్డితో శ్రావణికి పరిచయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. మూడేళ్లపాటు ఈ స్నేహం కొనసాగిందని ఆయన చెప్పారు. 2017లో శ్రావణికి నిర్మాత ఆశోక్ రెడ్డితో పరిచయం ఏర్పడిందన్నారు.2019 ఆగష్టులో శ్రావణికి దేవరాజు రెడ్డితో పరిచయం ఏర్పడిందని  పోలీసులు చెప్పారు. 

దేవరాజుతో స్నేహంగా ఉండడం సాయికృష్ణకు నచ్చలేదని తమ దర్యాప్తులో తేలిందని  జాయింట్ సీపీ శ్రీనివాస్ చెప్పారు.ఆత్మహత్య చేసుకొనే ముందుకు శ్రావణి దేవరాజుతో మాట్లాడిందన్నారు. దేవరాజు, సాయికృష్ణ, ఆశోక్ రెడ్డిలు శ్రావణిని పెళ్లి చేసుకొంటానని మాటిచ్చారని జాయింట్ సీపీ చెప్పారు. 

శ్రావణిని మానసికంగా, శారీరకంగా హింసించారని పోలీసులు చెప్పారు.గతంలో దేవరాజుపై శ్రావణి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ల్ లో కేసు పెట్టినట్టుగా ఆయన గుర్తు చేశారు.ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఈ ముగ్గురు కారణమయ్యారని ఆయన వివరించారు.