హైదరాబాద్: రాజస్థాన్  లో ఓఎల్ఎక్స్  నిందితులను పట్టుకొనేందుకు వెళ్లిన తెలంగాణ పోలీసులకు చుక్కలు చూశారు. అచ్చు 'ఖాకీ' సినిమాలో పోలీసులపై రౌడీ మూకలు దాడులకు పాల్పడినట్టుగానే దాడికి దిగారు. అయితే చివరి నిమిషంలో తేరుకొన్న పోలీసులు నిందితులపై ఎదురుదాడి దిగి వారిని అరెస్ట్ చేశారు.

ఓఎల్ఎక్స్‌లో వాహనాలను విక్రయిస్తామని ఫోటోలు పెట్టి విక్రయిస్తామని రాజస్థాన్ కు చెందిన ముఠా పలువురిని మోసగించింది.ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినవారి నుండి డబ్బులు తీసుకొని మోసం చేసేవారు. 

రాష్ట్రంలో పలువురిని ఈ ముఠా మోసం చేసింది.దీంతో పలువురు పోలీసులను ఆశ్రయించారు.రాజస్థాన్ కు చెందిన ముఠా ఓఎల్ఎక్స్ లో వాహనాలను విక్రయిస్తామని మోసం చేస్తున్నట్టుగా గుర్తించారు.

నిందితులను అరెస్ట్ చేసేందుకు గాను వారంతా రాజస్థాన్ లోని భరత్ పూర్ కు వెళ్లారు. సీసీఎస్, సైబర్ క్రైమ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. పోలీసులను చూసిన నిందితులు వారిపై దాడికి దిగారు. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు.

అయితే చివరి నిమిషంలో పోలీసులు తేరుకొన్నారు. నిందితులపై ఎదురు దాడికి దిగారు. వెంటాడి 10 మంది నిందితులను పట్టుకొన్నారు. ఐదు రోజుల క్రితం తెలంగాణ పోలీసులు రాజస్థాన్ భరత్ పూర్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 18 మందిని అరెస్ట్ చేశారు.