తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు పలు సూచనలు చేశారు.
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రజలకు పలు సూచనలు చేశారు.
హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించిందని గుర్తుచేశారు. ఈరోజు రాత్రి, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పారు. భారీ వర్షాల వల్ల ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. చిన్నపిల్లలతో పాటు నగర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాత్రి, పగలు పోలీసులు అందుబాటలో ఉంటారని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.
మరోవైపు రెండు, మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు హిమాయత్ సాగర్ గేట్లను తెరవనున్నారు. దీంతో లోతట్టు, పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇక, తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..
రాష్ట్రంలో మరో రెండు రోజులు పాటు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈశాన్య, వాయువ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.
